వివాదాలకు అతీతంగా అందరి సహకారంతో వైఎస్సార్ సిపి గెలుపుకోసం ఉద్యమిస్తానని మాజీ శాసనసభ్యుడు యలమంచిలి రవి స్పష్టం చేసారు. నాటి రాజశేఖర రెడ్డి పరిపాలన కావాలంటే, పేదలకు అన్నీ దక్కాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలసిందేనన్నారు. పాదయాత్రతో అధికార పక్షం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, రానున్న ఎన్నికలలో వారికి ప్రతిపక్ష హోదా సైతం దక్కబోదని యలమంచిలి స్పష్టం చేసారు.
శనివారం యలమంచిలి తన శ్రేణులతో వైసిపిలో చేరనున్న తరుణంలో శుక్రవారం ఇక్కడి యలమంచిలి కాంప్లెక్స్‌లో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. నగరానికి చెందిన వైసిపి నేతలతో యలమంచిలి సమావేశం కాగా, పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యలమంచిలి మాట్లాడుతూ నీతి, న్యాయం ఆలంబనగా తమ కుటుంబం ఇప్పటివరకు రాజకీయాలు చేసిందని, ఇకపై కూడా అదే తీరుగా వ్యవహరిస్తామని అన్నారు. తన తండ్రి యలమంచిలి నాగేశ్వరరావు విజయవాడ అభివృద్ది కోసం ఎంతో చేసారని, ఆ పరంపరను తాను సైతం కొనసాగించానని వివరించారు.
చేయవలసిన పనులు చాలానే ఉన్నాయని, కాలక్రమేణా వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీగానే వ్యవహరిస్తూ వచ్చిందని, క్షేత్ర స్ధాయిలో చేసింది శూన్యమని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పాల్టొన్న గన్నవరం నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ మంచికి మారుపేరుగా యలమంచిలి కుటుంబం ప్రసిద్ది పొందిందని, వారు వైసిపిలో రావటం శుభ పరిణామమన్నారు. ఇప్పటికే తమ అధినేత జగన్ యలమంచిలిని స్వాగతించారన్నారు. వివాద రహితునిగా పేరుపొందిన యలమంచిలి తమకు అదనపు బలమేనన్నారు.
రవి వంటి బలమైన నాయకుని ఆవశ్యకత విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఉందని సరైన సమయంలో ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని అభిలషించారు. నగర వైసిపి కార్పోరేటర్లు చందన సురేష్, దామోదర్, రవి, శివశంకర్ , పాల ఝాన్సి తదితరులు యలమంచిలి రాకను స్వాగతిస్తూ తమదైన రీతిలో ఆయనను ప్రసంశించారు.