శవాలపై పేలాలు ఏరుకునే జగన్ సర్కారు : దేవినేని ఉమ ధ్వజం

సోమవారం, 10 మే 2021 (10:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కరోనాతో చనిపోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించలేని పరిస్థితి చాలా చోట్ల నెలకొన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
 
కరోనా చావులోనూ ప్రశాంతత కరువవుతోందని దేవినేని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహం తరలింపు మాటున అడ్డగోలు దోపిడీ జరుగుతోందని చెప్పారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తున్నారని... చికిత్స కంటే అంత్యక్రియల ఖర్చే ఎక్కువగా ఉంటోందని మండిపడ్డారు. 
 
కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఎదుటే యథేచ్చగా కాసుల దందా కొనసాగుతోందని అన్నారు. ఇదేం కర్మ అంటున్న బాధిత కుటుంబాల ఆవేదన వినపడుతోందా జగన్ గారూ? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్‌తో పాటు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన షేర్ చేశారు.
 
హిందూ శ్మశానవాటికలో ధరల పట్టిక 
ఏపీ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా గుంటూరులోని శ్మశాన వాటికలు ధరలు నిర్ణయించేశాయి. కరోనాతో మరణించిన వారికి ఒక రేటు, సహజ మరణానికి ఒక ధరను ఫిక్స్ చేశాయి. ఈ మేరకు శ్మశానం గోడలపై అందరికి తెలిసేలా తాటికాయంత అక్షరాలతో ధరలు రాసుకొచ్చారు. 
 
కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేయాలంటే రూ.5,100, సహజ మరణానికైతే రూ.2,200 చెల్లించాలంటూ పాత గుంటూరు హిందూ శ్మశాన వాటిక గోడలపై రాశారు. గతంలో సాధారణ మరణానికి గరిష్ఠంగా రూ.1200 వసూలు చేసేవారు. ఇప్పుడు దానికి అదనంగా రూ.1000 పెంచారు. 
 
నగరంలోని ఒక్కో శ్మశాన వాటికలో ఒక్కోలా వసూలు చేస్తున్నారని, అందుకనే శ్మశాన వాటికల పాలకవర్గాలతో చర్చించి ఉన్నతాధికారులు ఈ ధరలు నిర్ణయించినట్టు నగర పాలక కొవిడ్ మరణాల పర్యవేక్షణాధికారి, డిప్యూటీ కమిషనర్ టి.వెంకటకృష్ణయ్య తెలిపారు.
 
అయితే, ఈ విషయంలో నగర పాలక సంస్థకు సంబంధం లేదని కమిషనర్ అనురాధ చెప్పడం గమనార్హం. ఆయా శ్మశాన వాటికల కమిటీల ఆధ్వర్యంలోనే ఇదంతా  జరుగుతుందని స్పష్టంచేశారు. ప్రజల సౌకర్యార్థం అంత్యక్రియల ఖర్చులను బోర్డులపై ఏర్పాటు చేయాలని ఆదేశించామని, అయితే పాత గుంటూరు శ్మశాన వాటిక వద్ద బోర్డును తప్పుగా రాయించారని అన్నారు.
 
అనాథ శవాల అంత్యక్రియల బాధ్యత నగరపాలక సంస్థదేనని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని అనురాధ హెచ్చరించారు. కొవిడ్ మృతుల దహన సంస్కారాలను అవసరమైతే ఉచితంగా చేయాలని ప్రభుత్వం చెబుతుంటే ఇలా ధరలు నిర్ణయించడంపై నగర వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 

కరోనాతో చావులోనూ ప్రశాంతత కరువు. మృతదేహం తరలింపు మాటున అడ్డగోలు దోపిడీ. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున డిమాండ్. చికిత్స కంటే అంత్యక్రియల ఖర్చే ఎక్కువ.కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి. ప్రభుత్వాసుపత్రుల ఎదుటే యధేచ్ఛగా దందా.ఇదేం కర్మ అంటున్న బాధిత కుటుంబాల ఆవేదన వినబడుతుందా ? @ysjagan pic.twitter.com/Fin9SajMtu

— Devineni Uma (@DevineniUma) May 10, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు