రైతుభరోసా పేరుతో రైతుల నోట్లో జగన్ మట్టి: టీడీపీ

బుధవారం, 28 అక్టోబరు 2020 (08:07 IST)
రైతు పక్షపాతి అనే పదానికి ఏకైక అర్హుడిని ఈ  ప్రపంచంలో తానేనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, తనకు తానే స్వీయ ధృవీకరణలు ఇచ్చుకోవడం, సొంతడబ్బాలు కొట్టుకోవడం ఆయనలా మరే ముఖ్యమంత్రి చేయడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...! 

ప్రజలకు ఏవైనా మంచిపనులు చేసి, వారిని ఉద్ధరించేలా ఘనకార్యాలు ఏవైనా చేసి, చేసినవాటిని చెప్పుకుంటే పర్లేదుగానీ, తప్పుడు పనులుచేస్తూ, వాటిని సమర్థించుకునేలా పత్రికల్లో ప్రజాధనం వెచ్చించి సొంతడబ్బాలు కొట్టుకోవడం జగన్ కే  చెల్లింది. ప్రజలసొమ్ముని తన ప్రచారపిచ్చికి దుర్వినియోగం చేసే ముఖ్యమంత్రిని ఈరాష్ట్రంలోనే చూస్తున్నాం.

వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద వరుసగా రెండోఏడాదికూడా రాష్ట్రంలో 50.47లక్షల రైతుకుటుంబాలకు పెట్టుబడి సాయంగా రూ.6,797కోట్లు ఇచ్చినట్లు పత్రికలకు ఆర్భాటంగా ప్రకటనలిచ్చారు. నేడు ఆసొమ్ము మొత్తం రైతుల ఖాతాల్లో పడుతున్నట్లు ప్రకటనల్లో చెప్పారు. రైతుభరోసా పథకమే పెద్ద రైతుదగా పథకం. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తానని, కేంద్రం సాయంతో సంబంధంలేకుండా ఏటా తానే చెల్లిస్తానని ప్రతిపక్షంలోఉన్నప్పుడు జగన్  చెప్పారు.

ఇప్పుడేమో కేంద్రంఇచ్చే సొమ్ముతో కలిపి రూ.12,500 ఇస్తానని చెబుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రూ.18,500 ఇస్తానని చెప్పాడు. దానిపై రైతులంతా గొడవచేయడంతో ఏదో కంటితుడుపుచర్యగా రాష్ట్రం ఇచ్చే రూ.6,500లకు అదనంగా మరో వెయ్యి పెంచారు. రూ.1000 పెంచినా మరో 5వేలు ప్రతిరైతుకు కోతపెట్టారు.

జగన్ ప్రభుత్వంలో రైతులకు చేసే సాయానికి సంబంధించిన రాతలేమో మిన్నగా సాయమేమో సన్నగా ఉంది.  సరిగ్గా ఏడాదిక్రితం అక్టోబర్ 15, 2019న సాక్షిపత్రికలో రైతుభరోసా కింద ఇచ్చిన ప్రకటనలో, మొత్తం లబ్దిదారుల సంఖ్య 54లక్షల మందికి వర్తింపచేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రైతుభరోసా పథకానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలో 50.47లక్షలలకు లబ్ధిదారుల సంఖ్యలో మూడున్నర లక్షలమందికి కుదించారు.

ఒక్క ఏడాదిలోనే మూడున్నర లక్షలమంది రైతులు ఏమయ్యారో  తెలియదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో రైతుభరోసా గురించి మాట్లాడుతూ, 64.06వేల మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వర్తింపచేస్తామని చెప్పారు. 64 లక్షలమంది రైతులు 2019 అక్టోబర్ నాటికి 54లక్షల మంది ఎలా అయ్యారో, తిరిగి ఈ ఏడాది అక్టోబర్ నాటికి 50.47లక్షలమందికి ఎలా తగ్గిందో చెప్పాలి.

చేతిలో దొంగపత్రిక ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు తప్పుడు రాతలు, తప్పుడు ప్రకటనలు వేస్తారా? 2019 అక్టోబర్ లో రైతుభరోసా పథకం కింద మొత్తం లబ్దిదారుల సంఖ్య కేవలం 46లక్షల69వేల,375 మంది మాత్రమే అని సాక్షి పత్రికలో నేడు (27-10-2020) రాశారు. 2020 ఖరీఫ్ సమయానికి  లబ్దిదారలు సంఖ్యను 49 లక్షల 57వేలకు పెంచామని, ఇప్పుడు రబీ సమయానికి ఏకంగా 50లక్షల 47వేలకు పెంచామని తప్పుడురాతలు రాశారు.

సాక్షిపత్రికలో  వేసిన ప్రకటనలో లబ్ధిదారుల సంఖ్య 54లక్షలని చెప్పి,   2019 అక్టోబర్ నాటికి అదేసాక్షిలో 46లక్షల69వేల 375 మంది అని ఎలా చెప్పారు? ప్రజలుఏదినమ్మాలి? రైతుభరోసా పథకాన్ని 54లక్షలమందికి ఇస్తామనిచెప్పి, 8లక్షలమందికి కోతపెట్టేసి, చివరకు 46లక్షల69వేలమందికే ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పత్రికలో రాసిన వాటిపై ఏం సమాధానం చెబుతారు?

ఈ విధంగా ప్రకటనలపేరుతో ఒకలా, రాతల్లో మరోలా ఎలా తప్పుడు రాతలు, కాకిలెక్కలు చెబుతున్నారో ప్రజలంతా అర్థంచేసుకోవాలి. వచ్చే ఏడాది లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గొచ్చు. 2019 అక్టోబర్ లో రైతుభరోసా పథకాన్ని 46లక్షల69వేలమందికే జగన్మోహన్ రెడ్డి అమలుచేశారా? లేదంటే సాక్షిపత్రిక ప్రకటనలో చెప్పినట్టు 54లక్షలమందికి అమలుచేశారా?

ఏది వాస్తవమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. తెలుగుప్రజల మనస్సాక్షి పేరుతో ప్రజలకు ఎన్ని రకాలుగా తప్పుడు రాతలు రాస్తున్నారో, రాష్ట్ర రైతులను ఎలా మోసగిస్తున్నారో అందరూ అర్థంచేసుకోవాలి. 
 
54లక్షల మంది రైతులు, ఈరోజు ఇచ్చిన ప్రకటనలో 50.47లక్షలకు ఎలా పరిమితమయ్యారు? 2019 అక్టోబర్ లో రైతుభరోసా పథకాన్ని 46లక్షల69వేలమందికే అమలుచేశారా... పేపర్లో ప్రకటనఇచ్చినట్లు 54 లక్షలమందికి అమలుచేశారా...లేక ఇప్పుడు ప్రకటనలో చెప్పినట్లు 50.47లక్షల మందికే ఇచ్చారా? ఈ విధంగా ఏటికేడు రైతుభరోసా పథకం లబ్ధిదారుల సంఖ్య ఎలా తగ్గుతుంది?

ఈ విధంగా వందలకోట్లు తగలేసి తప్పుడు ప్రకటనలిస్తారా? మిస్టర్ జాదూ జగన్ మాయా జాలం ఇలానే ఉంటుందేమో? ఈ లెక్కలన్నీ ఇలా ఉంటే, సమాచార హక్కుచట్టం ద్వారా ఇచ్చిన సమాచారంలో మరో విధంగా ఉన్నాయి. టీడీపీ కార్యాలయం వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర వ్యవసాయ ఉపసంచాలకుల వారు 15-10-2020న సమాచారం ఇచ్చారు.

వారు ఇచ్చిన సమాచారంలో రాష్ట్రంలోని కౌలురైతుల సంఖ్య దాదాపు 15లక్షలని ఉంది. 2019-20 సంవత్సరంలో లక్షా58వేల123మంది కౌలురైతులకు రైతుభరోసా పథకాన్ని వర్తింపచేసినట్టు చెప్పారు.  2019-20లో లక్షా58వేలమందికి రైతుభరోసా సాయం అందచేస్తే, 2020-21 వచ్చేసరికి 41,243 మంది కౌలురైతులకు రైతుభరోసా అందించారు.

15లక్షలమంది కౌలురైతులుంటే, వారి సంఖ్య లక్షా 58వేలమందికి ఎలా వచ్చిందో, 2020-21నాటికి  41,243 మందిఎలా అయ్యారో చెప్పాలి. ఈ విధంగా కౌలు రైతులనోట్లోకూడా ఈ పెద్దమనిషి మట్టికొట్టాడు. రెండో ఏడాది వచ్చేసరికి కౌలురైతుల సంఖ్యలో లక్షా10వేల మందికి కోత పెట్టేశారు. దీనికి వ్యవసాయ మంత్రి కురసాలకన్నబాబు ఏం సమాధానంచెబుతారు? కురసాల కన్నబాబు ఇచ్చే స్ట్రోకులకు రైతులకూసాలు కదులుతున్నాయి.

కేంద్రం అమలుచేసే పీఎం కిసాన్ యోజన పథకం వివరాలు చూస్తే, ఏపీలో లబ్ధిదారులైన రైతుల సంఖ్య 38లక్షల45వేల945మంది అని ఉంది.  జగన్మోహన్ రెడ్డి  దీనికేమి సమాధానం చెబుతారో చెప్పాలి.  రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో 50.47లక్షలమంది ఉంటే, కేంద్రం వెబ్ సైట్లో మాత్రం 38లక్షల45వేలమంది మాత్రమే ఎలా ఉన్నారు?  కేంద్రం ఇచ్చే రూ.6,500లకేగా జగన్ ప్రభుత్వం తనవాటా సొమ్ము చెల్లించేది.

మరి అలాంటప్పుడు రైతుల సంఖ్యలో కేంద్రానికి, రాష్ట్రానికి ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది? ఈ విధంగా తప్పుడు లెక్కలతో జగన్మోహన్ రెడ్డి రైతులను నిలువునా దగా చేస్తున్నాడు. సొంత పేపర్లో ఒకలా రాసుకుంటూ, ప్రకటనల్లో మరోలా చెప్పుకుంటూ, కేంద్రం లెక్కల్లో మరోలా ఎలా చెబుతారు? ముఖ్యమంత్రి ఈ విధంగా దగాలు, మోసాలతో రైతుల పీక నొక్కుతున్నాడు. జగన్ చేస్తున్న దారుణాలు చూడలేకే రైతు ఆత్మహత్యల్లో ఏపీ రెండోస్థానంలో నిలిచింది. 

మరోపక్క వరదలు వచ్చిరైతులు నష్టపోతే, ఒక్క మంత్రికూడా పలకరించినపాపాన పోలేదు. కొన్ని లక్షల హెక్టార్లలో పంటమునిగితే పట్టించుకోరా? నారాలోకేశ్ రైతులను పరామర్శించడానికి వెళ్తే ఆయనపై విమర్శలు చేస్తారా? 2104 నుంచి 2109 మధ్య రైతులకు ఇచ్చిన ఇన్ పుట్ సబ్సిడీ మొత్తం రూ.3,728కోట్లు. అంటే సరాసరిన ఏటా రూ.745కోట్లు పంటకోల్పోయిన వారికి పరిహారంగా ఇచ్చారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం కలిపి ఇప్పటివరకు రూ.200కోట్లు ఇచ్చారు. పంటనష్టపోయినా రైతులను ఆదుకోని ప్రభుత్వం రైతులపక్షపాతప్రభుత్వం అవుతుందా? కనీసమద్ధతు ధర గురించి ఒక్కరోజుకూడా వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడలేదు. రూ.3వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామన్నారు...అదేమైందో తెలియదు. ఇవన్నీ చాలవన్నట్లు అమరావతి రైతుల చేతికి బేడీలువేస్తారా?

రైతులు ఎవరిని హత్యచేశారు..ఎవరిని దోచుకున్నారని వారిచేతులకు బేడీలేశారు? రూ.45వేలకోట్లు దోచుకున్న జగన్ చేతికి బేడీలు వేయాలి... 12కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రికి వేయాలి. రాష్ట్రంకోసం తమభూములను త్యాగం చేసినవారి చేతులకు బేడీలు వేయడమేంటి? ఈప్రభుత్వానికి ఆ పనిచేయడానికి మనసెలా వచ్చింది? దిక్కుమాలిన పథకాలపేరుతో వేలకోట్ల పేరుతో రైతులను మోసగించిందిచాలక, వారి చేతులకు బేడీలు వేస్తారా? 

జగన్ నరరూపరాక్షసుడిగా మారారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. ముఖ్యమంత్రి పీఠంపైకూర్చున్నాం కదా అని నియంతలా మారి, ప్రజలను హింసిస్తున్నందుకు జగన్ తగినమూల్యం చెల్లించుకుంటాడు. రైతుభరోసా పథకం పచ్చిదగా, పచ్చి మోసమని ప్రజలంతా ఇప్పటికైనా తెలుసుకోవాలి. 

రైతులను దారుణంగా వంచించింది చాలక  వారు వాడుకునే ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులమోటార్లకు మీటర్లు బిగించే చర్యను జగన్మోహన్ రెడ్డి మానుకోకుంటే, రాష్ర్ట రైతాంగం తరుపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమిస్తాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు