గత ప్రభుత్వం హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయని, అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైకాపా నేతలు, శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇందులోభాగంగా, ఎమ్మెల్యే డోలా ఇంటిని ముట్టడించారు. దీంతో డోలా ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలోని నాయుడుపాలెంలో ఎమ్మెల్యే నివాసం ఉండగా, అక్కడ వైకాపా నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కొండపి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జ్ వరికూటి అశోక్ బాబు నేతృత్వంలోని ఎమ్మెల్యే ఇంటి ముట్టిడికి వెళ్లేందుకు వైకాపా కార్యకర్తలు, నేతలు టంగుటూరులోని వైకాపా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే నివాసానికి బయలుదేరారు.
మరోవైపు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా వైకాపా తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వరికూటి అశోక్బాబు ఇంటి ముట్టడికి బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే డోలాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.