కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తేరుకోలేని షాకిచ్చారు. పార్లమెంటులో ప్రతిష్టాత్మకమైన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుల ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిపై విజయభేరీ మోగించారు. ఈ ఎన్నికల్లో విపక్ష పార్టీలన్నీ కలిసి సీఎం రమేష్‌కు ఓట్లేసి గెలిపించాయి. దీంతో ఆయన రికార్డు స్థాయిలో విజయం సాధించాడు.
నిజానికి టీడీపీకి రాజ్యసభలో కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. కానీ విపక్ష పార్టీలన్నీ ఏకం కావడంతో రమేష్‌కు 106 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైసీపీ కూడా రమేశ్‌కే మద్దతు పలకడం విశేషం. ఇక విశ్వాసపరీక్షలో నరేంద్ర మోడీ సర్కారుకు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే కూడా ఝలక్ ఇచ్చింది. మొత్తం 13 మంది సభ్యులూ రమేశ్‌కే ఓటేయడం గమనార్హం. అలాగే, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఓటింగ్‌లో పాల్గొని సీఎం రమేష్‌కు ఓటు వేయడం గమనార్హం.
పార్లమెంటు పీఏసీకి చెందిన రెండు సీట్లకు సోమవారం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో కాంగ్రెస్, అన్నాడీఎంకే, వామపక్షాలు, టీఆర్‌ఎస్, వైసీపీ, బీజేడీకి చెందిన ఎంపీలందరూ రమేశ్‌కు అండగా నిలబడటంతో అత్యధిక ఓట్లతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భూపేంద్ర యాదవ్‌కు 69 ఓట్లే లభించాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు కేవలం 26 ఓట్లు రావడంతో ఆయన ఘోరంగా ఓడిపోయారు.