ఆంధ్రప్రదేశ్‌లో నిండుకుంటున్న కరోనావైరస్ టీకా నిల్వలు - ప్రెస్ రివ్యూ

గురువారం, 8 ఏప్రియల్ 2021 (09:57 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకాల నిల్వలు తగ్గుతున్నాయని ఈనాడు పత్రిక వార్తా కథనం ప్రచురించింది. ‘‘ఏపీలోని నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అవసరాలకు సరిపడా టీకాలు లేక.. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 5 లక్షల డోసులే ఉన్నాయి. కానీ అవసరం ఎక్కువగా ఉంద’’ని ఈనాడు రాసింది.

 
‘‘ప్రస్తుతం సరఫరా చేస్తున్న రెండు టీకాల్లో ఒకటే కాస్త అందుబాటులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 1,633 కేంద్రాల ద్వారా 2,32,355 మందికి టీకా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. వీరిలో 90,947 మందికే పంపిణీ చేశారు. తొలి డోసులో వేయించుకున్న టీకానే రెండోసారీ వేయించుకోవాలి.

 
వీరి అవసరాలకు తగ్గట్లు టీకా అందుబాటులో లేక.. లబ్ధిదారులు కంగారుపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు మొత్తం 2,22,330 డోసులు రాగా.. వీటిలో 2,21,000 పంపిణీ చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి జిల్లాలో టీకా నిల్వలు బాగా తగ్గాయి. దీంతో కర్నూలు జిల్లా నుంచి తెప్పించిన ఐదువేల డోసుల్లో నెల్లూరుకు 4వేలు, కావలికి 1,000 డోసులు సర్దుబాటు చేశారు.

 
పశ్చిమగోదావరి జిల్లాలోనూ మంగళవారం సాయంత్రానికే టీకాలు నిండుకున్నాయి. విశాఖ, ఇతర జిల్లాల నుంచి తెప్పించి లబ్ధిదారులకు ఇస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం, కల్యాణదుర్గం ప్రాంతాలకు కేటాయించిన టీకా పంపిణీ రెండు రోజుల నుంచి జరగడంలేదు. ఇక్కడ 33 కేంద్రాలను ఏర్పాటుచేసినా, తక్కువ కేంద్రాల్లోనే పంపిణీ జరుగుతోంది. గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కృష్ణాజిల్లాలో ఫలానా టీకాయే కావాలని లబ్ధిదారులు చెబుతున్నందున అది అందుబాటులో లేదని అధికారులు అంటున్నార’’ని ఈనాడు రాసింది.

 
డిమాండ్‌కు తగ్గట్లు కేంద్రం నుంచి టీకాల పంపిణీ జరగడం లేదు. జిల్లా అధికారులు టీకాల పంపిణీ, నిల్వలపై కచ్చితమైన ప్రతిపాదనలు పంపకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల కూడా టీకాల రాక ఆలస్యం అవుతోంది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రానికి ఒకటి, రెండు రోజుల్లో రెండు లక్షల డోసులు, మరో వారంలోగా పది లక్షల డోసుల టీకాలు వస్తున్నాయి. డిమాండ్‌ ఉన్న చోటకు టీకా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వవర్గాలు తెలిపాయని ఈనాడు వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు