ఏపీలో ఇన్ని ఆలయాలపై దాడులు జరిగాయా? గవర్నర్ విస్మయం

శుక్రవారం, 8 జనవరి 2021 (09:58 IST)
దేశంలోని హిందూ ఆలయాల్లోపై దాడులు జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. గత యేడాది సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు వందల కొద్ది ఆలయాల్లోని విగ్రహ మూర్తులపై దాడులు జరిగాయి. ఈ దాడులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇందులో 'రాష్ట్రంలో 140 ఆలయాల్లో దాడులు జరిగాయా... చాలా ఎక్కువగానే జరిగినట్లుందే' అంటూ విస్మయం వ్యక్తంచేశారు. 
 
గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో 'వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికి 140 ఆలయాల్లో విధ్వంస సంఘటనలు జరిగాయి. తొలి దాడి జరిగినప్పుడే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే ఇన్ని జరిగేవి కావు. 19 నెలలుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణకు ఆదేశించండి' అని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలంటూ డిమాండ్ చేశారు. 
 
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య నాయకత్వంలో వెళ్లిన ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. కాగా.. రహదారుల విస్తరణ కోసం తొలగించిన దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇవాళ నిద్ర లేచారా అని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. 
 
"రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టలేని సీఎం నష్టనివారణ కోసం తొలగించిన ఆలయాలు కట్టిస్తామని బయలుదేరారు. ఆయనకు వాటి విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?" అంటూ నరేంద్ర విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు