శోభా చనిపోయిన ఆస్పత్రిలోనే : నెత్తుటి నేలలో నీళ్లు పారాలని.. కత్తులు వీడి కలిసి ఉండాలని.. (Bhuma Video)
సోమవారం, 13 మార్చి 2017 (11:02 IST)
నాడు తన భార్య శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందిన ఆసుపత్రిలోనే, ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తన తుది శ్వాస విడవడం వైచిత్రి. ఆళ్లగడ్డలో ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురవడంతో, ఫిట్స్, ఆపై గుండెపోటు రావడంతో మృతి చెందారు.
అయితే, భూమాను ఆళ్లగడ్డలోని స్థానిక ఆసుపత్రికి తరలించిన అనంతరం, మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలలోని సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. భూమా ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఆయన తుది శ్వాస విడిచారు.
ఇదిలావుంటే, 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేశారు. ప్రచారం ముగింపు రోజు ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నంద్యాలలో వైఎస్ షర్మిల ప్రచార సభలో పాల్గొన్నారు. రాత్రి భోజనం చేసిన అనంతరం, ఆళ్లగడ్డకు వెళ్తుండగా గూబగుండం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
నంద్యాలలోని సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. అయితే, మెరుగైన చికిత్స కోసం ఏప్రిల్ 24వ తేదీన ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడే ఆమె కన్నుమూశారు. ఇపుడు ఆమె భర్త, నంద్యాల ఎంపీ భూమా నాగిరెడ్డి కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.