గంటా అనుచరుడు నలంద కిశోర్ అనుమానాస్పద మృతి

శనివారం, 25 జులై 2020 (13:23 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆయన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ మూడు వారాల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్థరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. 
 
విశాఖపట్నం నుంచి నేరుగా కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చి, విచారించి ఆయనను తిరిగి వదిలేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన బంధువులు అంటున్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన... చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయారని వారు తెలిపారు. 
 
ఐదు రోజులుగా జ్వరంతో బాధపడ్డారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. కాగా, నలంద కిశోర్‌ను అరెస్టు చేసిన సమయంలో ఏపీ ప్రభుత్వంపై గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. 
 
ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆయన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ పోలీసులు అరెస్టు చేసి, వదిలేసిన కొన్ని రోజులకే మృతి చెందారు. 
 
దీనిపై రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కిశోర్ మృతి తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు. 'భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. నలంద కిశోర్ కరోనాతో చనిపోయారని తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యగానే భావించాలి. 
 
కిశోర్ ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పటికీ ఆయనను విశాఖపట్నం నుంచి కర్నూలుకు తీసుకెళ్లారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసే విన్నపం ఒకటే.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి' అంటూ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.
 
'ఆయన చేసిన పోస్టుల్లో ఎవరి పేరూ లేదు.. అయినప్పటికీ అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనపై కొందరు పోస్టులు చేశారు. పొలిటికల్ పంచ్‌ అంటూ వైసీపీ సభ్యుడు ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను పోలీసులు తీసుకెళ్తే చాలా గగ్గోలు పెట్టాము' అని చెప్పారు. 
 
'ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే తప్పేంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. మరి ఇప్పుడు మనం కూడా ఇలాగే చేస్తే ఎలా? ఇంతకు ముందు రంగనాయకమ్మ విషయంలోనూ పోలీసుల తీరు బాగోలేదు. పోలీసుల తీరును సీఎం జగన్‌ నిరసించాలి' అని వ్యాఖ్యానించారు. రోజురోజుకీ ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు