టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమ్మ కులాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని, గ్రామ స్థాయిలో పార్టీ కోసం పని చేసిన క్యాడర్ చాలా నిరుత్సాహంగా ఉన్నారని, ఇది పార్టీ మనుగడకు మంచిది కాదని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడే వారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
గుంటూరులోని కమ్మ జన సేవా సమితిలో కాకతీయ కన్వెన్షన్ కమిటీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో తాను చాలా జూనియర్‌ని అని, అందుకే, చంద్రబాబును గట్టిగా ప్రశ్నించలేకపోతున్నట్టు చెప్పారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికలలో తాను పోటీ చేయనని, తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని రాయపాటి స్పష్టం చేశారు.
చంద్రబాబు కమ్మ కులాన్ని పట్టించుకోవడం లేదని రాయపాటి ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసే వారిని, పార్టీని నిలబెట్టేవారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం... తన పదవి కోసం చంద్రబాబు ఓ కులానికి కొమ్ము కాస్తున్నాడని పరోక్షంగా మరో అగ్ర కులానికి చెందిన టీడీపీ నేతలకు ఆయన చురకలంటించారు.