తెలుగుదేశం తరఫున గన్నవరంలో గత ఎన్నికల్లో గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీకి ఫిరాయించడం ఆ పార్టీకి ఓ పెద్ద దెబ్బ అయింది. దీనికి తోడు వంశీ అక్కడికెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిత్యం తీవ్ర విమర్శలు చేస్తుండటం మరో ఇబ్బందిగా మారింది. దీంతో గన్నవరంలో ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే వంశీని ఓడించాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు, అక్కడికి పాత కాపు, ప్రస్తుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను పంపాలని నిర్ణయించారు.
గతంలో గన్నవరం నుంచి గెలిచిన చరిత్ర ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ఇప్పటికీ అక్కడ పూర్తిగా పట్టుంది. దీంతో పాటు గద్దె రామ్మోహన్ కు రాజకీయంగా పట్టుతో పాటు, ప్రజల్లో కూడా సౌమ్యుడనే పేరుంది. దీంతో గద్దెను గన్నవరానికి పంపడం ద్వారా అక్కడ వంశీని ఓడించగలమని టీడీపీ భావిస్తోంది. అయితే, దీనిపై ఎమ్మెల్యే గద్దె రియాక్షన్ ఎలా ఉందన్నది మాత్రం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గతంలో ఇలానే దేవినేని అవినాష్ ని గుడివాడకు పంపి ఓడించినట్లు, గద్దె పరిస్థితి కూడా తయారవుతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.