అమరావతిని నాశనం చేసి ఏపీని ముక్కలు చేయాలని ప్లాన్ : అచ్చెన్నాయుడు

బుధవారం, 20 జనవరి 2021 (13:43 IST)
నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించిన అమరావతిని నాశనం చేసి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని వైకాపా చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రపన్నారని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆరోపించారు. 
 
అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని పేర్కొంటూ సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెల్సిందే. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని, ముక్కలు చేయాలని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని, ఒకే ఒక నినాదంతో ముందుకు వెళుతున్నారని, అదే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని వ్యాఖ్యానించారు. 
 
ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే పదం చట్టంలో లేదని తాము ఆనాడే చెప్పామన్నారు. ఇది కోర్టులో నిలబడదని కూడా చెప్పామన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పబ్బం గడుపుకోవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అయితే ఒకడుగుముందుకేసి తమ పేర్లన్నీ చదివారని, అసెంబ్లీలో సినిమా చూపించారని... ఇప్పుడెండుకు నోరు తెరవడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 
 
సీఎం జగన్, మంత్రి బుగ్గన, వైసీపీ నాయకులంతా కలిసి ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు.. ఆయన అనుచరులు భూములు కొనుగోలు చేశారు కాబట్టే రాజధానిని ముక్కలు చేస్తున్నామని అన్న విషయాన్ని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అయితే ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని మంగళవారం హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. న్యాయస్థానం ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు వేసినా సీఎం జగన్ బుద్ధి మారడం లేదన్నారు. ఆయన వైఖరి దున్నపోతుపై వర్షం పడిన చందంగా ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు