చంద్రబాబు కోసం ఊరూవాడా ఏకమైంది.. ఎక్కడ చూసినా నిరసన ర్యాలీలే...

సోమవారం, 18 సెప్టెంబరు 2023 (09:43 IST)
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఏపీ ప్రభుత్వం ఉంచింది. ఈ నెల 22వ తేదీ వరకు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అయితే, చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
 
ఆదివారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోనూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొనడం విశేషం. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఈ ర్యాలీకి హాజరై టీడీపీ మద్దతుదారులకు సంఘీభావం తెలిపారు. మరోవైపు, ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిమేర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ర్యాలీలో బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహా రెడ్డి కూడా పాల్గొన్నారు.
 
ఇదిలావుంటే, చంద్రబాబు అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విదేశాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నిరోజులుగా ప్రవాసాంధ్రులు అనేక దేశాల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేపడుతున్నారు. తాజాగా యూరప్‌లోని బెల్జియం దేశంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 'మేము సైతం బాబుగారికి తోడుగా' కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ మేము సైతం బాబుగారికి తోడుగా అనే కార్యక్రమాన్ని బెల్జియంలోని బ్రసెల్స్ నగరం అటోమియం ముందు శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. 
 
అటు, అమెరికాలోని ఫిలడెల్ఫియాలోనూ పలు తెలుగు సంఘాలకు చెందినవారు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చిన గొప్ప నేత చంద్రబాబు అని అమెరికా ప్రవాసాంధ్రులు కొనియాడారు. హైదరాబాదును సాఫ్ట్‌వేర్ హబ్‌గా మార్చిన విజనరీ లీడర్ అని కీర్తించారు.
 
అలాగే, బ్రిటన్‌లోనూ చంద్రబాబుకు సంఘీభావంగా ప్రదర్శనలు చేపట్టారు. లండన్ నగరంలో తెలుగు ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నినదించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు