'గ్రామ సర్పంచిగా నాకు గౌరవం ఇవ్వలేదు.. పైగా బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్‌ఐ అవమానకంగా మాట్లాడారు. హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లిపోవాలా' అని జిల్లాలోని కొవ్వూరు మండలం చిడిపి పంచాయతీ సర్పంచి, టీడీపీ నేత పాలడుగుల లక్ష్మణరావు ప్రశ్నించారు.
గ్రామంలో బుధవారం జగన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, హోం మంత్రి తానేటి వనిత ముఖ్యఅతిథిగా వస్తున్నారని అధికారులు చెప్పడంతో శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేసి ఇంటికొచ్చామన్నారు. ఈలోగా పోలీసులొచ్చి తనతో పాటు మరో ఆరుగురిని బలవంతంగా స్టేషన్‌కు తీసుకొచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
స్టేషనులో గ్రామీణ ఎస్ఐ సతీష్ అవమానకరంగా మాట్లాడారని వాపోయారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్టు చేయవచ్చని, తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అదుపులోకి తీసుకొన్నారంటూ చొక్కా విప్పి స్టేషన్ వరండాలో మెట్లపై కూర్చుని లక్ష్మణరావు నిరసన వ్యక్తం చేశారు.