అబ్బాయిలు, అమ్మాయిల మధ్య జననాల మధ్య వ్యత్యాసం రావడంతో ఆడపిల్ల పుడితే బాగుండని గ్రామస్థులు అనుకున్నారు. ఆ గ్రామస్థుల కోరిక నెరవేరింది. జనవరి తొలి వారంలో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో వారి సంతోషం అంబరాన్నంటింది. అందరూ కలిసి గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని వేడుక జరుపుకున్నారు. ఆడశిశువులకు జన్మనిచ్చిన వారిని సన్మానించారు. ఇదంతా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్‌పూర్ గ్రామంలో జరిగింది.
ఈ గ్రామంలో మొత్తం 816 మంది నివసిస్తున్నారు. అయితే, అబ్బాయిలు-అమ్మాయిల మధ్య లింగ నిష్పత్తిలో అంతరం ఎక్కువగా ఉండడంతో ఆవేదన చెందారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు మనుగడకే ముప్పు రావొచ్చని భయపడ్డారు. ఇలా అయితే లాభం లేదని ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. జనవరి మొదటి వారంలో ముగ్గురు అమ్మాయిలు జన్మించడంతో నిన్న గ్రామంలో అందరూ కలిసి వేడుక చేసుకున్నారు.