ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటి ముందు బైఠాయించారు. దీనికి కారణం గత పదిరోజులుగా ఆ విద్యార్థి బడికి రావడం లేదు. దీంతో ఆ విద్యార్థిని మళ్లీ బడికి పంపాలని తల్లిదండ్రులను కోరుతూ ఉపాధ్యాయుడు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి నేలపై కూర్చొని బైఠాయించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరిగింది.
ఈ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉంది. ఇక్కడ 64 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇందులో పదో తరగతిలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. వారిలో నవీన్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా బడికి రావడంలేదు. ఆ విద్యార్థిని పాఠశాల రప్పించేందుకు ప్రధానోపాధ్యాయుడి సూచనతో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉదయం విద్యార్థి ఇంటికి వెళ్లారు.
నవీన్ పది రోజులుగా బడికి రావడంలేదని చదువులేకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని అతని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారు స్పందించకపోవడంతో విద్యార్థిని బడికి పంపించాలని కోరుతూ ఇంటి ఎదుట బైఠాయించారు. కొద్ది సమయం తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డను బడికి పంపేందుకు పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు సమ్మతించారు.