తెలుగు అకాడమీ తెదేపా అకాడమీ కాదు: మంత్రి ఆదిమూలపు సురేశ్‌

గురువారం, 15 జులై 2021 (09:22 IST)
తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కలిపి తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు.

తెలుగు భాష అభివృద్ధి, మరింత విస్తృతం చేసేందుకే కేబినెట్‌లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ద్రవిడ భాష నుంచి ఆవిర్భవించిన తెలుగులో పరిశోధన కోసం సంస్కృతాన్ని జోడించి అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

తెలుగు అకాడమీ తెలుగుదేశం పార్టీ అకాడమీ కాదని ఆ పార్టీ నేతలు గుర్తించాలని.. తమ విమర్శలు సరిచేసుకోవాలని హితవు పలికారు. తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయిందని మంత్రి ఆరోపించారు. సంస్కృతం భారతీయ భాషలకు మూలమన్నారు.

దీని ప్రభావం తెలుగుపై చాలా ఎక్కువ ఉంటుందని.. రెండింటినీ వేర్వేరు భాషలుగా చూడలేమని వివరించారు. తెలుగు భాష మూలాలను తెలుసుకోవాలంటే పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

విభజన తర్వాత రెండేళ్లలో తెలుగు అకాడమీని ఏపీలో ఏర్పాటు చేయలేకపోయారని.. అందుకే ఇప్పుడు రెండింటినీ కలిపి తెలుగు-సంస్కృత అకాడమీగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు