అమెరికాలో తిండికీ అగచాట్లు పడుతున్న తెలుగువిద్యార్థులు.. డాలర్ కలలు ఇక భ్రమేనా
బుధవారం, 24 మే 2017 (02:48 IST)
నిన్నటివరకు భూతల స్వర్గంగా కనిపించిన అమెరికా ఇప్పుడు కళ్లముందు ప్రత్యక్ష నరకంగా మారిపోయింది. ప్రత్యేకించి డాలర్ కలలను పంచ రంగుల్లో కంటూ ఇన్నాళ్లుగా మెరుగైన జీవితం కోసం అష్టకష్టాలు పడి ఆశలు నింపుకున్న, పండించుకున్న తెలుగు విద్యార్థులు, యువతీయువకులు నిజంగానే కాళ్లకింద భూమి కదిలిపోతున్న పరిస్థితిని ప్రతి రోజూ అనుభవిస్తూనే రేపటి పట్ల భయాందోళనలు చెందుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అనే ఒక సొంత ప్రయోజనాల వాది పుణ్యమా ఆని కొన్ని వేలమంది తెలుగు విద్యార్థినీ, విద్యార్థులు అతి త్వరలోనే ఇంటిముఖం పట్టక తప్పని పరిస్థితి ఎదురవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఎందుకంటే, అమెరికాలో మామూలు చదువులు, ఉద్యోగాలు అలా పక్కనబెడితే, కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కూడా ఇప్పుడక్కడ ఉద్యోగాలు లేవు. అతికొద్ది అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందేవారి పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయినా.. సాధారణ వర్సిటీల్లో చదివి కన్సల్టెన్సీలపై ఆధారపడి ఉద్యోగాలు చేద్దామనుకున్న భారతీయ విద్యా ర్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల కిందట గ్రాడ్యుయేషన్ చదవడానికి వచ్చి పట్టా చేత పట్టుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
తల్లిదండ్రులు తమ భూములమ్మి, ఇళ్లు తాకట్టు పెట్టి లక్షల రూపాయలు ఫీజు చెల్లించి అమెరికాకు పిల్లలను పంపిస్తే అక్కడ వాళ్లు కోర్సులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు దొరకక, ఇంట్లోవాళ్లు పెట్టిన అప్పులను తీర్చేదెలాగో అర్థం కాక విలపిస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. పోనీ కొన్నాళ్లు పరిస్థితి కుదుటపడే వరకు ఏదో ఒక తాత్కాలికి ఉద్యోగాలనైనా చేసుకుని బతుకుదామనుకుంటే ఉన్నవి ఊడిపోవడమే తప్ప, కొత్త ఉద్యోగాలు దొరకని స్థితిలో ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాకేసి చూసినా ఇలా అమరికాకు పిల్లలను పంపి తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలే కనబడుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో డజనుకు పైగా ఐటీ సంస్థలకు దరఖాస్తు చేసినా.. ఏ సంస్థ నుంచీ ఇంటర్వ్యూకు పిలుపురాక, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఫలితం లేక, స్వదేశం నుంచి తండ్రి పంపే డబ్బుతోనే జీవితం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఉందని, మరో రెండుమూడు నెలలు చూసి స్వదేశానికి వెళ్లి ఏదో ఉద్యోగం వెతుక్కుంటానంటూ కన్నీటిపర్యంతమవుతున్న అనూష పరిస్థితి దారుణం, తన చదువు కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చేదెలా అని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈమె లాంటి వారు వేలమంది అమెరికాలో తల్లడిల్లుతున్నారు.
ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇచ్చే ప్రక్రియ అమెరికాలో ఇప్పటికే మొదలు కావడంతో గత పాతికేళ్ల అమెరికా సమాజంలో ఎన్నడూ లేనంత దుర్భర పరిస్థితి భారతీయలను వెంటాడుతోంది.