ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆవరణలో కాటరాక్ట్ కేంద్రం ప్రారంభించిన ముఖేష్ కుమార్ మీనా

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (14:23 IST)
నేత్ర సంరక్షణ సేవల పరంగా ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ మంచి పనితీరును ప్రదర్శించటం ముదావహమని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తూ ఉత్తమమైన సంస్ధగా నిలిచిందన్నారు.
 
విజయవాడ తాడిగడప కోడె వెంకటాద్రి చౌదరి ప్రాంగణంలోని ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆవరణలో హైదరాబాదుకు చెందిన శ్రీదేవి, సురేష్ చల్లా సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్లంకి వెంకటేశ్వరరావు, విజయ కుమారి కంటి శుక్ల కేంద్రంను ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ అంధత్వానికి కంటిశుక్లం అత్యంత ముఖ్యమైన కారణంగా ఉందని, దేశంలోని అంధులలో 50-80 శాతం మంది శుక్లం కారణంగానే అంధులుగా మారుతున్నారన్నారు. అయితే 2007 నుంచి 2019 వరకూ అంధత్వ ప్రాబల్య నివారణలో 47 శాతం, దృష్టి వైకల్యం తగ్గింపులో 51.9 శాతం మేర మన దేశం విజయం సాదించిందన్నారు.
 
సంస్ధ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఆత్మకూరి రామం మాట్లాడుతూ రోగికి సహజసిద్దంగా సమకూరే కటకం మసకబారి నప్పుడు దానిని మార్చి కృత్రిమ కటకం అమర్చటమే శుక్ల చికిత్సలో అందుబాటులో ఉన్న మార్గం కాగా,  చిన్నారుల మొదలు వృద్దుల వరకు అందరికీ ఎల్ వి ప్రసాద్ సంస్ధ సేవలు అందించగలగటం ముదావహమన్నారు. ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ తాడిగడప కోడె వెంకటాద్రి చౌదరి ప్రాంగణ అధిపతి డాక్టర్ అనసూవా గంగూలీ కపూర్ మాట్లాడుతూ పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్టులతో సహా అనుభవజ్ఞులైన, అర్హతగల వైద్య బృందంతో కంటిశుక్లం చికిత్సకోసం అధునాతన శస్త్రచికిత్స పద్ధతులను అందిస్తుందన్నారు.
 
నిర్దుష్టత, భద్రత, రోగి సంతృప్తి అంతిమ లక్ష్యంగా తమ సంస్ధ మంచి ఫలితాలను సాధిస్తుందని, శుక్ల కేంద్రం ఏర్పాటుకు ఉదారమైన మద్దతునిచ్చిన  శ్రీదేవి, సురేష్ చల్లాలకు ఎంతో రుణపడి ఉంటామన్నారు. 2011 ఫిబ్రవరి లో స్థాపించిన నాటి నుండి 7,22,242 మంది ఔట్ పేషంట్లను పరీక్షించి, 35,345 శుక్ల శస్త్రచికిత్సలతో సహా మొత్తం 73,941 శస్త్రచికిత్సలు చేసామన్నారు. సంరక్షణ క్లిష్టతతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పధకం ద్వారా పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ రాయ్ , డాక్టర్ సుషాంక్ అశోక్ భలేరావ్  తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు