ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానటరింగ్ బిల్లు చరిత్రాత్మకం... సీఎం జగన్
సోమవారం, 29 జులై 2019 (18:43 IST)
"ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మోనటరింగ్ కమిషన్ బిల్లు ఒక చరిత్రాత్మక బిల్లు. మన కళ్ల ఎదుటే ప్రైవేటు స్కూళ్లు ఫీజుల పేరుతో.. తల్లిదండ్రులను ఎడాపెడా బాదుతూ ఉన్నా కూడా, ఎవ్వరూ అడగలేని పరిస్థితిని మనం చూశాం.." అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... "సాక్షాత్తూ ఆ పెద్ద పెద్ద స్కూళ్లు, కాలేజీలకు సంబంధించి యాజమాన్యాలకు చెందినవారే గత ప్రభుత్వంలో ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఆ పెద్ద పెద్ద వాళ్లే మంత్రులుగా ఉన్న పరిస్థితుల్లో.. ఇక వీళ్లు స్కూళ్లను, ఫీజులను నియంత్రించలేని పరిస్థితి.
విద్యకు సంబంధించి దేశంలో ఒక చట్టం ఉంది. స్కూళ్లుగాని, కాలేజీలు కాని ఏవీ కూడా లాభాపేక్షతో, వ్యాపార దృక్పథంతో నడపాల్సినవి కావు. దేశంలో ఉన్న చట్టాల ప్రకారం, స్కూళ్లు, కాలేజీలు నడిపితే.. వాటిని ప్రజాసేవలో భాగంగానే నడపాలి. కానీ ఎల్‌కేజీ ఫీజులు, యూకేజీ ఫీజులు, ఫస్ట్‌క్లాస్ ఫీజులు కూడా ఏకంగా రూ.63వేలు, లక్ష రూపాయలు అని చెప్తుంటే.. నిజంగా ఎక్కడా కూడా మన పిల్లలు చదివే పరిస్థితి లేదు.
రాష్ట్రంలో ప్లాన్ ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళను నీరుగార్చారు. ప్రతి ప్రైవేటు స్కూల్లోనూ 25శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. తక్కువ ఫీజులు వసూలు చేయాలి, ఆ ఫీజులు కూడా ప్రభుత్వం కట్టాలి. గడిచిన ఐదేళ్లలో ఒక్క స్కూల్లో కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేదు. దాంతో ఇష్టానుసారం ఆ స్కూళ్ళలో ఫీజులు పెంచుకునే పరిస్థితులు వచ్చి, వ్యవస్థ అంతా నాశనమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇటువంటి విధానాల వల్ల గత ఐదేళ్ళూ ప్రభుత్వ స్కూళ్లను క్రమంగా నీరుగార్చారు. చివరకు ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన బకాయిలు కూడా కనీసం 6–8 నెలలపాటు చెల్లంచని పరిస్థితి. సరుకుల బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యపుస్తకాలను కూడా సమయానికి ఇవ్వలేదు. జూన్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు సెప్టెంబరు, అక్టోబరులో కూడా ఇవ్వని పరిస్థితులను నా పాదయాత్రలో చూశాను.
హేతుబద్దీకరణ పేరుతో స్కూళ్లను మూసేయడంతోపాటు ఓ పద్దతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే కార్యక్రమాలను చేశారు. కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. చివరకు విద్య పేరుతో దోచేసే పరిస్థితులు ఆంధ్రరాష్ట్రంలో చూశాం.
విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చే దిశగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చదువు అన్నది ఒక హక్కుగా మేం చర్యలు ప్రారంభించాం. తల్లిదండ్రులుగానీ, ప్రభుత్వాలకు గానీ పిల్లలకు, భావితరాలకు ఏదైనా ఆస్తిగా ఇవ్వగలిగేది ఒక్క చదువు మాత్రమే.
మన పిల్లలను మనం చదివించుకోగలిగితే వాళ్లు రేపు పొద్దున పేదరికం నుంచి బయట పడతారు. పేదరికంనుంచి బయటపడేసే ఆయుధం చదువు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చదువులు అతి దారుణంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థను మేలుకొలపడానికే ఈ బిల్లును తీసుకు వచ్చాం.
ఆంధ్ర రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రానివారు 33 శాతం మంది ఉన్నారు. అంటే ఎంతటి దారుణంగా నిరక్షరాస్యత ఉందో అర్థం చేసుకోండి. తల్లిదండ్రులకు పిల్లలను చదివించాలన్న కోరిక, తపన లేక కాదు, కానీ వారికి ఆర్థిక స్థోమత లేని కారణంగా.. రాష్ట్రంలో నిరక్షరాస్యత 33శాతం ఉంది. దేశంతో పోలిస్తే దేశం మొత్తం మీద నిరక్షరాస్యత 26శాతమే. కానీ రాష్ట్రంలో 33 శాతం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ బిల్లును తీసుకు వస్తున్నాం.
చదువు అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది ఉద్దేశం. హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించే రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమిస్తున్నాం. 11 మందిని సభ్యులను నియమిస్తున్నాం.
జాతీయస్థాయిలో ప్రముఖ విద్యా నిపుణులను ఈ కమిషన్‌లో నియమిస్తున్నాం. ఈ కమిషన్ ఏదైనా స్కూలుకు వెళ్లి అక్కడ అడ్మిషన్, టీచింగ్ ప్రక్రియలను పర్యవేక్షించగలుగుతారు. స్కూళ్ల గ్రేడింగ్‌ను, విద్యాహక్కు చట్టం అమలును, అక్రిడేషన్‌ను వీళ్ల పరిధిలోకి తీసుకు వస్తున్నాం.
యాజమాన్యాలను హెచ్చరించడమే కాదు, జరిమానాలు విధించడం, చివరకు స్కూళ్లను కూడా మూసివేయించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. స్కూళ్లలో ఫీజులు రియాల్టీలోకి రావాలి. ఏ మాత్రం ఫీజులు ఉంటే.. పిల్లలు చదువుకోగలుగుతారు అన్నది వీరు పర్యవేక్షిస్తారు. అక్కడ చదువులు, మౌలిక సదుపాయాలను కూడా పర్యవేక్షిస్తారు. ప్రతి మధ్యతరగతి, పేద వారికి అందుబాటులోకి చదువులను తీసుకెళ్తున్నాం. అందుకే ఈ చట్టం చేస్తున్నాం" అని ముఖ్యమంత్రి అన్నారు.