కోనసీన ప్రాంత ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో రసాయన పరిశ్రమల (దివీస్ కెమికల్ ఇండిస్టీతో సహా) ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని, వెంటనే ఆ పరిశ్రమల ఏర్పాటును విరమించుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గతంలో దివీస్ పరిశ్రమను వ్యతిరేకించినట్లు వైసిపి నటించిందని, దివీస్ కెమికల్ ఇండిస్టీ ఏర్పాటుకు వైసిపి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ద్వారా ఇప్పుడా పార్టీ అసలు రంగు బయటపడిందని అన్నారు. ఈ రసాయన పరిశ్రమ ఏర్పాటు వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని, భూములంతా ఉప్పు తేలడంతో రైతులకు ఎనలేని నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
కాకినాడ సెజ్‌లో 51 శాతం షేర్లను రూ.2,511 కోట్లకు ఇప్పటికే కొనుగోలు చేసిన జగన్ బినామీలు బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా కోనసీమ ప్రాంతంలో గ్రామాలను కబ్జా చేసి, తీరప్రాంతాన్ని ఆక్రమించి తమ ఇండిస్టియల్ ఎస్టేట్ స్థాపనకు చేస్తున్న ప్రయత్నాలను గర్హిస్తున్నామని అన్నారు.