బిల్లులు కేంద్రానికి పంపడంలో ఎందుకింత జాప్యం?: గవర్నర్ ను నిలదీసిన యనమల

బుధవారం, 29 జులై 2020 (15:01 IST)
బిల్లులు కేంద్రానికి పంపడంలో ఎందుకింత జాప్యం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గవర్నర్ ను ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు యధాతథంగా...
 
గవర్నర్ 2బిల్లులను ఆర్టికల్ 200కింద కేంద్రానికి పంపకుండా ఎందుకింత తీవ్ర జాప్యం చేస్తున్నారనేది మా మొదటి ప్రశ్న. రెండవది రాష్ట్ర ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్ ను కొనసాగించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎస్ ఈసి నియామకంలో గవర్నర్ గారు ఎందుకింత తాత్సారం చేస్తున్నారు..? 

కోర్టులు చెప్పినట్లే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టికల్ 243(కె)ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం అక్షర సత్యం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ 2బిల్లుల కథ ముగించేందుకు ఆర్టికల్ 256, 257, 355 వినియోగించాల్సిన సరైన సమయం ఇదే.. 
ఆర్టికల్ 356 మరియు ఆర్టికల్ 360 ఈ బిల్లులపై వినియోగించాలని తెలుగుదేశం పార్టీ కోరడం లేదు. 

కేంద్రప్రభుత్వం చేసిన ఏపి పునర్వవస్థీకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈ 2బిల్లులను శాసన సభ, శాసన మండలికి తెచ్చింది కాబట్టి, తక్షణమే కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని సెటిల్ చేయాలి. సమాఖ్య రాజ్యం(ఫెడరల్ స్టేట్)గా మనదేశాన్ని రాజ్యాంగం పేర్కొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ‘‘ఫ్యూడలిస్ట్ పాలించే ఫెడరల్ స్టేట్’’ అయ్యింది అనేది మా నిశ్చితాభిప్రాయం. 
 
రాజ్యాంగంలో ఫెడరల్ అనే  పదాన్ని ప్రస్తావించక పోయినప్పటికీ ఆర్టికల్ 1(1)లో భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్(రాష్ట్రాల సమాఖ్య) గా పేర్కొన్నారు. రెండు ప్రయోజనాలే లక్ష్యంగా ఫెడరల్ అనే పదాన్ని బిఆర్ అంబేద్కర్ వినియోగించలేదు. 1) భారత సమాఖ్య అనేది ఏవో కొన్ని రాష్ట్రాల మధ్య ఒప్పందం ఫలితంగా ఏర్పడింది కాదు 2) రాష్ట్రాలకు(భాగస్వామ్య యూనిట్లకు) విడిపోయే స్వేచ్ఛ ఉండరాదు.
 
ఇప్పుడు మనందరిలోనే ఒక్కటే ప్రశ్న ఏమంటే, ఈ 2 బిల్లుల వివాదాస్పద అంశంలో  కేంద్రం ఎందుకని జోక్యం చేసుకోవడం లేదనేదే మనందరి ప్రశ్న. ఈ 2బిల్లులు 1) మూడు రాజధానుల బిల్లు, 2)సిఆర్ డిఏ రద్దు బిల్లు, రెండూ కూడా కేంద్రప్రభుత్వం చేసిన ఏపి పునర్విభజన చట్టం 2014 కిందకే వస్తాయి.
 
ఫెడరల్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేనప్పటికీ, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేచర్, ఫైనాన్సియల్ అధికారాల విభజన కేంద్ర, రాష్ట్రాల మధ్య స్పష్టంగా జరిగినప్పటికీ, కొన్ని కీలక అధికారాలను కేంద్రానికే(ఆర్టికల్స్ 2,3,4, 200,201,248,249, 254(1), 256,257, 275,280, 293, 352, 353, 355, 356, 360, 368 మొదలైనవి) కట్టబెట్టారనేది ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.

ఈ 2బిల్లుల విషయంలో కూడా వాటిని ప్రవేశపెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, కేంద్రం అనుమతితో లేదా రాష్ట్రపతి సంతకంతోనే వాటిని తేవాల్సి ఉంది కాబట్టి, గవర్నర్ వాటిపై సంతకం పెట్టబోయే ముందు ఆర్టికల్ 200 మరియు 201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలి. 

ఎందుకంటే ఈ 2బిల్లులు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రాష్ట్రపతి ఆమోదంతో వచ్చిన ఏపి పునర్విభజన చట్టం పరిధిలోకి వచ్చేవి కాబట్టి..కాబట్టి ఈ 2బిల్లుల అంశంలో రాష్ట్రపతి దృష్టికి నివేదించడం, ఆర్టికల్ 200 ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోరడం మినహా గవర్నర్ కు ప్రత్యామ్నాయం లేదు..

కేంద్రప్రభుత్వం రూపొందించిన, ఆర్టికల్ 3కింద  పార్లమెంటు ఆమోదించిన ఏపి పునర్వవస్థీకరణ బిల్లు 2014పై రాష్ట్రపతి మార్చి 14న సంతకం పెట్టారు. 

అందులో స్పష్టంగా పేర్కొన్నట్లుగా An Act to provide for the reorganisation of existing state of Andhra Pradesh and “FOR MATTERS CONNECTED THERE WITH” అంటే రాజధాని గురించి కూడా అనేది విదితం. 

‘‘ఒక రాజధాని(A Capital)’’ అనే, ఏపి రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, సెక్షన్ 5(2) సబ్ సెక్షన్(1)లో  స్పష్టంగా పేర్కొన్నారు.‘‘A new Capital ఒక రాజధాని ప్రాంత’’ గుర్తింపునకు నిపుణుల కమిటిని కేంద్రప్రభుత్వం నియమించాలని సెక్షన్ 6లో పేర్కొన్నారు.

‘‘ఒక రాజధాని’’ గుర్తింపు ప్రక్రియలో భాగంగా, కేంద్రం రూపొందించిన చట్టం ప్రకారం, హైకోర్టు, ఏపి చట్టసభల ఆమోదంతో అమరావతిని కొత్త రాజధానిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి వచ్చే ప్రభుత్వాలకు, రాష్ట్రపతి ఆమోదం లేకుండా దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం లేదు. 

‘‘కొత్త రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని’’ సెక్షన్ 94(3), సెక్షన్ 94(4)లో పేర్కొన్నారు. హైకోర్టు, సెక్రటేరియట్, చట్టసభల భవనాలు, ఇతర మౌలిక వసతులను గత ప్రభుత్వం అభివృద్ది చేసింది కేంద్ర చట్టం సెక్షన్ 94 సబ్ సెక్షన్ 4లో పేర్కొన్నట్లుగానే..

ఇటీవల మరో ముఖ్య ఉదాహరణ పిపిఏలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అంశంలో, వాటిపై రాష్ట్రం ముందుకు పోవద్దని కేంద్రం సూచించింది. కాబట్టి ఇలాంటి అత్యవసరమైన రాజ్యాంగ ఉల్లంఘనల వంటి అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజా ప్రయోజనాలను కాపాడుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
 
ప్రస్తుతం ఈ 2బిల్లుల అంశం కూడా, ఫెడరలిజం(సమాఖ్య రాజ్యం) కిందకు రాదు, ఆ ముసుగులో ఏపి ప్రభుత్వం దాక్కోలేదు.. అందుకే దీనిని ‘‘ఫ్యూడలిస్ట్ నడుపుతోన్న ఫెడరల్ స్టేట్..’’అంటున్నాం. ఇలాంటి అంశాలపై కేంద్రం ద్వారా పూర్తి నిర్ణయాధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి ఉంది. ఇందులో ఫెడరలిజమ్ అనే సమస్య ఉత్పన్నం కాదు. 
 
రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్మణ రేఖను రాష్ట్రప్రభుత్వం అతిక్రమిస్తే, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను వాడడంలో కేంద్రాన్ని ఏదీ నిరోధించలేదు. తమ అధికార పరిధిని ఎవరూ(ఏ యూనిట్) అతిక్రమించ రాదని రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరిచారు.. కానీ ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోంది.
 
భారతదేశంలో చట్టాలు 3 విధాలు, కేంద్ర పరిధి, రాష్ట్ర పరిధి, ఉమ్మడి పరిధి.. ఉమ్మడి జాబితాలో అంశాలపై కేంద్రానిదే ఆధిప్యతం. అవశేష అధికారాలన్నీ కేంద్రానికే దఖలు పరిచారు. భారత రాజ్యాంగం సమాఖ్య రాజ్యం కాదు, ఏకకేంద్ర రాజ్యమని ప్రొ కె పి ముఖర్జీ వాదన గుర్తుంచుకోవాలి.
 
కాబట్టి వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, ఈ 2బిల్లుల అంశంలో తక్షణమే జోక్యం చేసుకుని చక్కదిద్దేందుకు కేంద్రానికి ఇదే తగిన సమయంగా నా అభిప్రాయం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు