కొత్త సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి పేర్ని నాని

మంగళవారం, 28 జులై 2020 (10:22 IST)
కరోనా కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కోవిడ్ చికిత్సా కేంద్రాల్లో కొత్తసవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉన్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఆయన మచిలీపట్నం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు.

మరికొద్ది రోజులలో ఇదే ఆసుపత్రిని 250 పడకల కోవిడ్ ఆసుపత్రిగా రూపుదిద్దనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని వైద్య అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే సాధారణ రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ద్వారం గుండా ప్రవేశం కల్పించాలని, ఇందులో మెడికల్, క్షయ, సర్జికల్, ఏఎంసి వార్డులకు కలిపి ప్రధాన ద్వారం నుంచి లోపలకు అనుమతించాలని సూచించారు.

అదేవిధంగా కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చేవారి కోసం వెనుక వైపు ప్రత్యేక ద్వారం తెరవాలని కోరారు. ఆ మార్గంను మెటల్ రోడ్డుగా రూపొందించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. కోవిడ్ ఆసుపత్రిలో 250 పడకలను ఏర్పాటు చేయాలనీ , స్టాఫ్ నర్స్ లకు ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటుచేయాలన్నారు. 

కోవిడ్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఆక్సిజన్ పైప్ లైన్, ఆసుపత్రిలో ఉన్న 4 వెంటిలేటర్లుకు తోడు మరో 4 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని, అలాగే, ప్రతి బెడ్ కు ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉంచాలని వైద్యులకు మంత్రి తెలిపారు. ఈసిజీ, బీపి, ఆక్సిజన్, టెంపరేచర్ వివరాలు తెలిపే మల్టీ పారామీటర్లు 20 సమకూర్చుకోవాలన్నారు. కోవిడ్ ఆసుపత్రి నిర్వహణ కోసం 25 మంది వైద్యులు తమ సేవలను అందించనున్నట్లు పేర్కొన్నారు.

గత కొంతకాలంగా ఈ ఆసుపత్రిలో పనిచేయని సిటి స్కాన్  వెంటనే మరమ్మత్తు చేయాలనీ కోరారు. కోవిడ్ రోగులకు అందించే ఆహారం విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించి ఆహారాన్ని తాజాగా అందించాలన్నారు.

భోజనం విషయంలో శుచి శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎవరైనా కరోనా లక్షణాలతో కనిపిస్తే వారిని  జాగ్రత్తగా వైద్యసేవలను అందించాలని, కోవిడ్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే ఎన్నో మరణాలను అడ్డుకోవచ్చని మంత్రి పేర్ని నాని  చెప్పారు. 

ఆసుపత్రి సందర్శనలో మంత్రి వెంట మచిలీపట్నం అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్  బొర్రా విఠల్,  బందరు ఆర్డీఓ ఖాజావలి, మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ, మచిలీపట్నం తహశీల్ధార్ సునీల్, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరెండెంట్ జయకుమార్, ఆర్ఎం మల్లికార్జునరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు