శాసనసభను భజనసభగా మార్చారు ... టీడీపీ

మంగళవారం, 30 జులై 2019 (20:27 IST)
శాసనసభను భజన సభగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింటులో జరిగిన విలేకరుల సమావేశంలో నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ...

"టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసి వారి సభ్యులతో మాత్రమే మాట్లాడించడం ద్వారా శాసనసభను వైసీపీ భజన సభగా మార్చింది. శాసనసభను నియంత్రించేది స్పీకర్‌ అయితే అలాంటి స్పీకర్‌ను నియంత్రించేది జగన్మోహన్‌రెడ్డి. ఇది చాలా దురదృష్టకరం. 14 రోజుల సభలో ప్రతిపక్ష నాయకుడికి మైక్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో సిగ్నేచర్స్‌ అయినప్పటికి టీడీపీ శాసనసభ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు.

సంతకాలు లేకపోయినా అధికారపక్ష శాసనసభ్యులకు అవకాశం ఇచ్చిన పరిస్థితి. 14 రోజులు జరిగిన శాసనసభను చూస్తే ఏపీ శాసనసభ కాదు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలా వారు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. 60 రోజుల వైసీపీ పాలన చూస్తే బడ్జెట్‌లో అంశాలు అన్నీ జగన్‌ టర్న్‌ అనే పరిస్థితి నెలకొంది. పాదయాత్ర, ఎన్నికల సమయంలో, ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో వందల కొద్ది హామీలిచ్చి ఇవాళ శాసనసభలో 3 పేజీల మేనిఫెస్టోను పదే పదే చూపిస్తూ ప్రజలను మోసం చేశారు.

అందుకే జగన్‌ను ప్రజలు యు టర్న్‌ కాదు జగన్‌ టర్న్‌ అని భావిస్తున్నారు. మాట తప్పం, మడమ తిప్పం అన్న జగన్‌... బడ్జెట్‌లో ప్రతి విషయంలో జగన్‌ టర్న్‌లే కనిపిస్తున్నాయి. రైతు భరోసా రైతు మోసంగా మార్చారు. టీడీపీ అన్నదాత సుఖీభవ కింద రూ.15 వేలు ఇస్తామన్నాం. కేంద్రం ఇచ్చే రూ.6,000లకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.9 వేలు కలిపి రూ.15 వేలు ఇస్తామని మేం ఆనాడు చెప్పాం.

వైసీపీ మాత్రం రూ.12,500లు ఇస్తామని, నాలుగేళ్లల్లో రూ.50 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా క్లియర్‌గా చెప్పారు. అధికారంలోకి వచ్చాక రూ.12,500లు కాదు, తూచ్‌ రూ.6,500లు మాత్రమే ఇస్తామని ఈరోజు చెబుతున్నారు. దీంతో ఒక్కొక్కరు ఏడాదికి రూ. 6,000లు నష్టపోతున్నారు. ఐదేళ్లకు ఒక్కో రైతు రూ.30,000లు నష్టపోతున్నారు.

రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులకు రూ.19,200 కోట్లు  రైతు భరోసా ద్వారా నష్టపోతున్నారు. '0' వడ్డీపై కుప్పిగంతులు వేశారు. ఏడాదికి రూ.3,500 కోట్లు ఇవ్వాల్సిన టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.180 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆరోజు జగన్మోహన్‌రెడ్డి చెప్పి, గంటకే వాళ్లు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించారు. గోదావరి జలాలు తెలంగాణ భూభాగంలో నడపాలన్న ఆరాటం జగన్‌ మాటల్లో కనిపించింది.

ఎందుకు ఈ ఆరాటం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను హిట్లర్‌తో పోల్చి నేడు సహృదయుడిగా ఏ విధంగా కనిపిస్తున్నాడు? తెలంగాణ భూభాగంలో మన ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సిన అవసరం ఏముందని జగన్‌ను ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో కేసీఆర్‌ ధన సాయం చేశాడు కాబట్టి ఈరోజు నీళ్ల సాయం చేస్తున్నారనే భావన ప్రజలందరిలోను ఉంది. జగన్‌ క్విడ్‌ప్రోకో చేస్తున్నారు.

జగన్‌ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని తెలియజేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్‌ అని ఇప్పుడు మాట తప్పారు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో, పాదయాత్రలో ప్రతి ఊరు, ప్రతి వాడలో హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.75 వేలు ఇస్తామని మాట మార్చారు. దీంతో ఆయా మహిళలు నెలకు రూ.3వేలు చొప్పున ఐదేళ్లలో లక్షా ఎనభై వేలు నష్టపోతారు. రూ.75 వేలు తీసేస్తే రూ.లక్షా ఐదు వేలు. మొత్తంగా రూ.15 వేల కోట్లు నష్టపోతున్నారు.

అమ్మఒడి పథకాన్ని ఘనంగా ప్రారంభించి ఆంక్షలఒడిగా మార్చారు. ఒకసారి ప్రభుత్వ స్కూలుకే పరిమితమని, మరోసారి ప్రైవేటు స్కూళ్లకే పరిమితమని, మరోసారి తల్లికే పరిమితమని చెబుతున్నారు. వైసీపీ శాసనసభ్యులే సభలో ఒకలా, మండలిలో మరోలా  చెబుతున్నారు. 
 
బీసీల పట్ల తక్కువ కేటాయింపులు చేశారు. మేము రూ.15వేల కోట్ల కేటాయింపులు చేస్తే, పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.14 వేల కోట్లకే పరిమితం చేశారు. బీసీల పట్ల ప్రేమ లేదనేందుకు బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనం. మద్యపాన నిషేదం అని చెప్పి మాట తప్పారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే పరిస్థితి నెలకొంది. గతంలో కంటే ఇప్పుడు మద్యం ఆదాయం రూ.2,290 కోట్లు పెరిగిందని మీరే చెప్పారు.

ఇది ఏ రకంగా సాధ్యం?, ఎలా మద్యపాన నిషేదమో జగన్‌ చెప్పాలి. ముఖ్యమంత్రి కనుసైగలతో సభను నడిపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఇవ్వలేని సభగా ఈ శాసనసభ మిగిలిపోతుంది. ముఖ్యమంత్రి చేతలకు, మాటలకు పొంతన లేదు. నియంతృత్వ ధోరణితో ముందుకెళ్తే ప్రభుత్వానికే నష్టం" అన్నారు.
 
గద్దె రామ్మోహన్‌రావుగారు మాట్లాడుతూ... "తెలంగాణలో ఇతర పార్టీల శాసనసభ్యుల్ని తీసుకుంటున్న కేసీఆర్‌ ఉత్తముడని జగన్‌ అంటున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులపై చంద్రబాబునాయుడుగారి ఇంటిముందు ధర్నా చేస్తామని మాట్లాడుతున్నారు.

వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్‌ చెప్పారు. దీంతో అభివృద్ధిని కాంక్షించి వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరారు. జగన్‌ ప్రకటన చేసేవరకు ఆ ఆలోచన లేదు. అంబటి రాంబాబు ఊసరవెల్లి. ఆయన మారని పార్టీ లేదు. ఏదైనా మాట్లాడితే స్వచ్ఛత ఉండాలి.

ఈరోజు పార్టీ మార్పులపై ఆమరణ దీక్ష చేస్తానని చెబుతున్నారు. వైఎస్‌ హయాంలో ఫిరాయింపులకు శ్రీకారం చుట్టారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పెట్టిందే వైఎస్‌. వైసీపీలోకి కూడా చాలామంది శాసనసభ్యులు రాజీనామా చేయకుండా పార్టీ మారారు. కొడాలి నాని ఇందుకు ఉదాహరణ" అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు