తిరుమ‌ల‌కు వెళ్లేందుకు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు

బుధవారం, 1 డిశెంబరు 2021 (20:11 IST)
తిరుపతి - తిరుమల మ‌ధ్య ప్ర‌యాణించేందుకు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో రెండో ఘాట్ రోడ్డులోని 13వ కి.మీ వద్ద, 15వ కి.మీ వద్ద కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయ‌ని, వీటి పునరుద్ధ‌ర‌ణ ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.  సాయంత్రం లోపు బండ‌రాళ్లు, మ‌ట్టిని పూర్తిగా తొల‌గిస్తార‌ని ఈఓ తెలియ‌జేశారు.                            
 
 
మొద‌టి ఘాట్ రోడ్డులో వాహ‌నాల రాక‌పోక‌లు కొన‌సాగుతున్నాయ‌ని, సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు 2,300 వాహ‌నాలు, తిరుమ‌ల నుండి తిరుప‌తికి 2,000 వాహ‌నాలు ప్ర‌యాణించాయ‌ని వివ‌రించారు. చెన్నై ఐఐటి ప్రొఫెస‌ర్లు తిరుమ‌ల‌కు చేరుకుని విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌ల‌ను ప‌రిశీలించార‌ని, ఢిల్లీ ఐఐటి ప్రొఫెస‌ర్లు గురువారం ఘాట్ రోడ్డును పరిశీలిస్తారని తెలిపారు. ఐఐటి నిపుణులు పూర్తిస్థాయిలో ప‌రిశీలించి సమర్పించే నివేదిక త‌రువాత త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఈఓ వివ‌రించారు. ఘాట్ రోడ్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజినీరింగ్, సెక్యూరిటి, ఫారెస్టు, ఆరోగ్య విభాగం తదితర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఈఓ ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు