గంటన్నరలో శ్రీవారి దర్శనం... విశాఖలో బస్సు ఎక్కితే చాలు...

బుధవారం, 15 ఆగస్టు 2018 (11:44 IST)
గంటన్నరలో తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనం కల్పించే వినూత్న కార్యక్రమాన్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించింది. ఏపీటిడిసి అధికారులు దీనికి సంబంధించిన అనుమతి తితిదే నుంచి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి వారంలో మూడు రోజులపాటు దర్శనం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ నెల 22 నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ఏపీటిడిసి బస్సులు మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతాయి. మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు తిరుపతి చేరుకుంటాయి. అక్కడే వసతి ఏర్పాటు చేసి నేరుగా ఆర్టీసీ బస్సులో కొండపైకి తీసుకువెళతారు. భక్తులు తలనీలాలు సమర్పించి దర్శనానికి సిద్ధం కావడానికి గంటన్నర సమయం ఇస్తారు. తరువాత వైకుంఠం ఎంట్రీ-1 వద్దకు చేరుకుంటే పర్యాటకశాఖ టూర్‌ మేనేజర్‌ దర్శనానికి తీసుకువెళతారు. తర్వాత తిరుపతికి వస్తారు. 
 
అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి కపిలతీర్థం, తిరుచునూరు దర్శనం చేసుకుని సాయంత్రం 4.30 గంటలకు శ్రీకాళహస్తిలో ఆరున్నరకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. టికెట్ ధర పెద్దలకు రూ.3,730, పిల్లలకు రూ.3,300 చార్జీగా నిర్ణయించారు. ఏపీటీడీసీ విశాఖ డివిజన్‌కు రెండు బస్సులు కేటాయించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు