శ్రీవారి పేరిట బ్యాంకుల్లో 11 టన్నుల బంగారం - రూ.17 వేల కోట్ల డిపాజిట్లు

ఆదివారం, 23 జులై 2023 (14:24 IST)
కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి వెల్లడించారు. వారణాసిలో జరిగిన అంతర్జాతీయ ధార్మిక సమావేశంలో ఆయన పాల్గొని ఈ విషయాలను బహిర్గతం చేశారు. తిరుమల శ్రీవారి ఆస్తులు, ఇతర నిర్వహణ వివరాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. 
 
ఆయన వెల్లడించిన వివరాల మేరకు... శ్రీవారి పేరిట బ్యాంకుల్లో రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకుల్లో 11 టన్నుల బంగారం ఉంది. శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాల బరువు 1.2 టన్నులు. వెండి ఆభరణాల బరువు 10 టన్నులు. తితిదే పరిధిలో 600 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. టీటీడీలో 24500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 
 
శ్రీవారి సన్నిధిలో ప్రతి రోజూ భక్తులకు సేవలు అందించే ఉద్యోగుల సంఖ్య 800 మంది. స్వామివారికి ప్రతియేటా 500 టన్నుల పుష్పాలతో అలంకరణ జరుగుతుంది. ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం ప్రతి యేటా 500 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 71 శ్రీవారి ఆలయాలు ఉన్నట్టు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు