తెలంగాణ వచ్చాక బోర్డులపై రాష్ట్రం పేరు మారింది... అంతే... భట్టి విక్రమార్క

శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (17:33 IST)
తెలంగాణ రాష్ట్రంలో యూరియా దొరక్క రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున యూరియా అవసరం ఉందని భట్టి చెప్పారు. 
 
తాజాగా దుబ్బాకలో ఎల్లయ్య అనే రైతు యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు పెట్టి.. రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడే ఓపిక లేక.. చనిపోయిన సంఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. ఈ రాష్ట్ర ప్రభత్వానికి ఏ మాత్రం ప్లానింగ్ లేదని చెప్పేందుకు ఈ ఘటనే పెద్ద నిదర్శనమన్నారు. టీఆర్ఎస్‌కు చెందిన మంత్రులు గతంలో మాట్లాడుతూ.. చాలా గొప్పలు చెప్పారని.. ఇప్పుడు ఏమి చేశారని భట్టి ప్రశ్నించారు. గత సంవత్సరం ప్లానింగ్ వచ్చామని చెప్పే కేటీఆర్.. ఈ ఏడాది మీ ప్లానింగ్ ఏమైందని భట్టి ప్రశ్నించారు.
 
యూరియా సరఫరా లేదు. కేంద్రం ఇవ్వలేదు, మరొకరు ఇవ్వలేదు మాట్లాడుతున్నారు.. అసలు మీకు ముందస్తు ప్రణాళిక ఏమైనా ఉందా? అని భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయ శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి గతంలో ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారని, భట్టి గుర్తు చేశారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు.. ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు.. ఆయనకు రాష్ట్రం మీద అవగాహన ఉంటుందని.. వ్యవసాయానికి మంచి రోజులు వస్తామని అనుకున్నట్లు భట్టి వివరించారు. 
 
అయితే ప్లానింగ్ లేదు.. యూరియా లేదు.. అని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులు క్యూలో నిలబడి చనిపోతుంటే.. భాధ్యతారాహిత్యంగా మరణించిన రైతును ఉద్దేశించి మంత్ర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తక్షణం రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. రైతులను సినిమా హాళ్లలో టిక్కెట్ల కోసం నిలబడిన వారితో పోల్చడం అనేది ప్రభుత్వానికి రైతుల మీద అభిప్రాయాన్ని స్పష్టం చేస్తోందని విక్రమార్క వివరించారు. రైతుల మీద ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని ఈ విషయం ద్వారా అర్థమవుతోందని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెబుతూ.. రైతుల గురించి ఇంత చిన్నగా మాట్లాడ్డం.. దురద్రుష్టకరమని అన్నారు.
 
రైతు బంధు నిధులు విడుదల చేయాలి
రైతుబంధు నిధులను వెంటనే రైతుల అకౌంట్లలో వేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఓట్లు వేసేందుకు క్యూలో నిలబడ్డ వాళ్లకు సైతం ఎన్నికలప్పుడు రైతె బంధు అకౌంట్లో జమ చేసినట్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు రైతు బంధు నిధులు అకౌంట్లలో వేయడం లేదని భట్టి ప్రశ్నించారు. రైతులు చాలా రోజుల నుంచి రైతు బంధు డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతుబంధు కింద దాదాపు 12 నుంచి 13 వేల కోట్ల రూపాయల నిధులను తక్షణం విడుద చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రైతులంతా పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. 
 
రుణమాఫీ నిధులు విడుదల చేయాలి
రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఇప్పటివరకూ విడుదల కాలేదని.. వాటిని వెంటనే విడుదల చేయాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు.. రుణమాఫీ రాక అ ఖాతాలు ఇర్రెగ్యులర్‌గా మారి.. కమర్షియల్ వడ్డీకి మారిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్ష రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేసి రైతును ఆదుకోవాలని అన్నారు. ఇన్సూరెన్స్ పంటకు ముందే కట్టాలి.. ఇప్పటివరకూ ప్రభుత్వం ఈ మొత్తాలను విడుదల చేయలేదని అన్నారు. ఇన్సూరెన్స్ నిమిత్తం కట్టాల్సిన దాదాపు రూ.దాదాపు 1500 కోట్లు వెంటనే కట్టాలని అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్లానింగ్ ఏముందని భట్టి ఎద్దేవా చేశారు. రైతుల కోసం సర్కార్ ఏమి చేస్తుందో చెప్పాలని అన్నారు. 
 
ఓనర్షిప్, మంత్రి పదవి కోసం కొట్లాట
గులాబీ పార్టీ ఓనర్షిప్ కోసమో, మంత్రి పదవి కోసమో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ కొట్లాడుతున్నారు. కానీ ప్రజల కోసం కాదని బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలు విషజ్వరాలు, డయేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు రాష్ట్రాన్ని కబళిస్తుంటే.. ఏమీ పట్టనట్లు ఈటల రాజేందర్ ఉన్నారని అన్నారు. వరంగల్‌లో ఏడు హైదరాబాద్‌లో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయతే వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఏమీ జరగడం లేదని మంత్రి వ్యాఖ్యానించడం దురదృష్టకరమని భట్టి అన్నారు. ఉద్యమం కన్నా, టీఆర్ఎస్ పార్టీ ఓనర్షిప్ కన్నా తెలంగాణ ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యమని, వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మీ కన్నా రసమయి బాలకిషన్ ఎంతో నమయని.. వాస్తవాలపై కనీసం స్పందించారని భట్టి విక్రమార్క అన్నారు.
 
మారింది బోర్డులో పేరు మాత్రమే
తెలంగాణ రాష్ట్రంలో మారింది కేవలం రాష్ట్రం పేరు మాత్రమేనని.. మిగిలినది ఏదీ మారలేదని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రజలు మనవాళ్లు.. వాళ్ల అభివృద్ధి కోసం కృషిచేయాలని భట్టి పిలుపునిచ్చారు. 
 
కేసీఆర్ బంగారు కుటుంబం
తెలంగాణ వచ్చాక.. బోర్డులపై రాష్ట్రం పేరు మాత్రమే మారితే.. సాధారణ కుటుంబంమైన కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం బంగారు కుటుంబంగా మారిందని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారకపోగా.. మరింత అధ్వానంగా తయారవుతున్నాయని భట్టి విమర్శించారు. మంత్రులు మంత్రుగా వ్యవహరించాలని, శాఖలపై పట్టు సాధించాలని భట్టి పిలునిచ్చారు. ప్రతి శాఖామంత్రి పర్యటనలు, సమీక్షలు జరపాలని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి మంత్రులు తాబేదారుల్లా వ్యవహరించవద్దని భట్టి చెప్పారు. 
 
యాదాద్రిపై మీ ఫొటోలు ఎందుకు?
యాదాద్రి స్థంభాలపై కేసీఆర్ ఫొటో, కారు గుర్తు ఉండడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా ప్రజాస్వామ్యమా..? లేక రాజరికమా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. చరిత్రను చూపించడం కోస దేవాలయాల్లో కారు బొమ్మను, కేసీఆర్ ఫొటోను చిత్రీకరించారని తెలుస్తోందని.. అసలు వీళ్ల చరిత్ర ఏమిటని భట్టి ప్రశ్నించారు. దేవాలయాల్లో ఫొటోలను చెక్కడమే పెద్ద తప్పు అని భట్టి అన్నారు. ఒక మతానికి చెందిన పుణ్యక్షేత్రం.. అక్కడకు అందరూ వస్తారు.. అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు వెళతారు.. అక్కడ రాజకీయాలకు తావు లేదు అటువంటి చోట ఫొటోలు ఎలా చెక్కిస్తారని అన్నారు. 
 
అలా చెక్కించాలి అంటే.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నవారివి, భూమి కోసం పోరాటం చేసిన రైతు సోదరులవి చెక్కించాలని అన్నారు. అలాగే భూమిపై హక్కుల కల్పించిన బూర్గుల రామకృష్ణారావు, బొంగుల నర్సింగరావు భూ సంస్కరణలు తీసుకువచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, దేశానికి ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా రాజ్యాంగం అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఫొటోలు చెక్కించాలని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు