అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు వేశారు. దీనిపై సోమవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసి, ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరిన విషయం తెలిసిందే.
అయితే, ఆ కౌంటర్‌పై రఘురామకృష్ణరాజు రిజాయిండర్ దాఖలు చేశారు. కౌంటర్‌లో జగన్ అసత్యపు ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు పిటిషన్ వేసే అర్హత లేదనడం అసంబద్ధమన్నారు. పిటిషన్ విచారణ అర్హతలపై కోర్టులు ఇప్పటికే స్పష్టతనిచ్చాయని వివరించారు.
రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదని జగన్ పేర్కొనడం సరికాదన్నారు. తనపై కేవలం ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని, చార్జిషీట్ దాఖలు చేయలేదని ఆయన వివరించారు. జగన్ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పేర్కొన్నారు.