పారదర్శకంగా నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే చెవిరెడ్డి

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (07:40 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నెల 25వ తేదీన నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మలగుంట సమీపంలోని తుడా అతిథిగృహంలో నియోజకవర్గ తహసీల్దార్లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో దాదాపు 25 వేల మంది లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరి కోసం నియోజకవర్గంలో ప్రజలు జీవనం సాగించేందుకు అనుకూలంగా ఉండే దాదాపు 500 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు.

ఇక్కడ నివసించే ప్రజల కోసం లేఅవుట్లలో అభివృద్ధి ప్రణాళికలు పక్కాగా రూపొందించాలని సూచించారు. ఇళ్ల పట్టాలకు కేటాయించే  లేఅవుట్ లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

మండల తహశీల్దార్ లు లబ్ధిదారుల ఎంపిక కు సంబంధించి ప్రక్రియను చేపట్టాలన్నారు. అలాగే పంపిణీ చేసే పట్టాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఓ ఎస్ డి లు రంగస్వామి, కిరణ్ కుమార్, మండల తహశీల్దార్ లు భాగ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు