ఇటీవల కరోనా సీజన్లో పలువురు జర్నలిస్టుల మరణాలు అందరినీ తీవ్రంగా కలచివేశాయని పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వార్తల సేకరణలో పడి, పోటీ ప్రపంచంలో అలుపెరుగని పని చేస్తూ, జర్నలిస్టులు తమ తమ ఆరోగ్యాలపై అశ్రద్ధ వహించడం వల్ల మృత్యువాత పడుతున్నారని స్పష్టం చేశారు. విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ చలసాని బాబూ రాజేంద్ర ప్రసాద్ సంస్మరణ సభను ఎం.వి.కె. భవన్లో నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్ ఛార్జిగా పనిచేసిన రాజేంద్ర బ్రెయిన్ క్యాన్సర్ తో పోరాడి, మృత్యు ఒడిలోకి ఒరిగిపోయారు. అయితే, ఈ క్యాన్సర్ ఆయనకు కరోనా సమయంలో రావడంతో ట్రీట్మెంట్ తో సహా అన్నింటికీ చాలా ఇబ్బంది ఎదురయింది. విజయవాడ వర్కింగ్ జర్నలిస్టు మ్యూచివల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్, బిల్డింగ్ సొసైటీకి అధ్యక్షులు కూడా అయిన రాజేంద్రకి నివాళులు అర్పించేందుకు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపి డబ్ల్యూజే ఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసో్సియేషన్ (ఎపిబిజెఎ) ఈ సంస్మరణ సభను నిర్వహించింది. దీనికి రాజేంద్ర తనయుడు హర్షను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సొసైటీ డైరెక్టర్ సి.సతీష్ బాబు ఈ కార్యక్రమానికి సంధాన కర్తగా వ్యవహరించారు. ఎపి డబ్ల్యూజే ఎఫ్ నగర కార్యదర్శి ఎం.బి.నాధన్ సభను ప్రారంభించారు.
విధి నిర్వహణలో ఎంత ఒత్తిడి ఉన్నా, రాజేంద్ర నిబద్ధతతో పనిచేసేవారని, తన తండ్రి దేవినేని నెహ్రూకు అత్యంత ఆప్తుడిగా ఉండేవారని వైసీపీ యువ నేత దేవినేని అవినాష్ ఈ సందర్భంగా తన నివాళులు అర్పించారు. విజయవాడ వర్కింగ్ జర్నలిస్టు మ్యూచివల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్, బిల్డింగ్ సొసైటీకి అధ్యక్షుడిగా రాజేంద్ర ఆశయ సాధనకు, విజయవాడలో జర్నలిస్టులకు ఇంటి స్థలం, ఇల్లు ఇప్పించేందుకు తాను శాయశక్తులా సహకరిస్తానని అవినాష్ హామీ ఇచ్చారు. సొసైటీ సీఇఓ వెంకట్రావ్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం, అధికారులతో సమన్వయ పరిచేందుకు రాజేంద్ర చేసిన కృషిని కొనియాడారు. ఈ సంకల్పాన్ని పూర్తి చేయడమే, రాజేంద్రకు నిజమైన నివాళి అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యూరో ఛీఫ్ దారా గోపి మాట్లాడుతూ, జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే, తమ కుటుంబ సభ్యులకు అన్యాయం చేసిన వారవుతారని, ఒత్తిడి ఎక్కువ ఉండే ఈ వృత్తిలో జర్నలిస్టులు తమకంటూ కొంత సమయం కేటాయించుకోవాలన్నారు.
ఆంధ్ర జ్యోతి ఎడిషన్ ఇన్ ఛార్జి ఎ. ఉమా మహేశ్వరరావు తనకు, రాజేంద్రకు ఉన్నసాన్నిహిత్యాన్ని వివరిస్తూ, పాతిక్రేయ వృత్తి పట్ల నిబద్ధత గలవాడు రాజేంద్ర అని కొనియాడారు. ఎన్.జె.యు కార్యదర్శి శాంతి మాట్లాడుతూ, మహిళా జర్నలిస్టులు పనిచేయాలంటే, తమకు కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమని, వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత గృహిణులపైనే ఉంటుందన్నారు. ఆంధ్రజ్యోతి డెస్క్ ఇన్ ఛార్జి పద్మ మాట్లాడుతూ, రాజేంద్ర తన కుటుంబానికి ఇచ్చిన ప్రాముఖ్యాన్ని వివరిస్తూ, అలాంటి వ్యక్తిని కోల్పోయిన ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం అన్నారు. మహా టీవీ స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ బాబు మట్లాడుతూ, రాజేంద్ర లాంటి సీనియర్ పాత్రికేయుల నుంచి యువ జర్నలిస్టులు ఎంతో నేర్చుకోవాలన్నారు. ఏపీబీజేఏ జిల్లా అధ్యక్షుడు, దూరదర్శన్ రిపోర్టర్ జె.శ్రీనివాసాచారి మాట్లాడుతూ, కత్తి కన్నా కలం గొప్పదని నానుడి ఉందని, కానీ ఇపుడు ఆ కలానికి కత్తి గాట్లు పడుతున్నాయన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యం కోసం త్వరలో ఏపీబీజేఏ తరఫున ఒక వెల్ నెస్ ప్రోగ్రాం రూపొందిస్తామన్నారు. హిందూ మాజీ రిపోర్టర్ రమణ మాట్లాడుతూ, పాత్రికేయ వృత్తిలో ఒత్తిడి జయించి, ఆరోగ్యపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు.
రాజేంద్ర కుమారుడు హర్ష మాట్లాడుతూ, పాత్రికేయులు పని ఒత్తిడిలోపడి కుటుంబంతో గడపడం మానివేయద్దని, మీరెంత బిజీగా ఉన్నా, మీకోసం కుటుంబ సభ్యులు ఇంట్లో ఎదురు చూస్తుంటారనేది గుర్తుంచుకోవాలని ఎంతో బాధగా చెప్పారు. తన తండ్రి రాజేంద్ర తమతో గడిపిన మధుర క్షణాలను హర్ష గుర్తు చేసుకున్నారు.