మా బ్యాచ్ దొంగ ఓట్లు వేయడం వల్లే గెలిచాను : ఎమ్మెల్యే రాపాక

శుక్రవారం, 5 మే 2023 (10:41 IST)
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఎన్నికపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనా ఆదేశాలు జారీచేశారు. ఆ ఉత్తర్వుల్లోని వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 24న అంతర్వేదిలో జరిగిన వైకాపా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వరప్రసాద్‌ మాట్లాడుతూ పూర్వం నుంచి తమ సొంత గ్రామం చింతలమోరికి కొందరు వ్యక్తులు దొంగ ఓట్లు వేయడానికే వచ్చేవారని, ఒక్కొక్కరు 5-10 ఓట్లు వేసేవారని, అవే తన విజయానికి దోహదపడేవని వ్యాఖ్యానించారు. 
 
దీనిపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన ఎనుముల వెంకటపతిరాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గత నెల 24న ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వరప్రసాద్‌ ఎన్నికపై విచారణ నిర్వహించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచించారు.
 
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై విచారణకు ఆదేశం నేపథ్యంలో ఫిర్యాదుదారు ఎనుముల వెంకటపతిరాజా మాట్లాడుతూ, 'దొంగ ఓట్లతో నెగ్గినట్లు రాపాక స్వయంగా ఒప్పుకొన్నారు. ఆయన ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారణ చేసి కాలయాపన లేకుండా చర్యలు చేపట్టాలి' అని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు