గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో అధికార తెరాస నేతలతో పాటు.. ఇతర రాజకీయ నేతలు, అధికారులకు కష్టాలు తప్పేలా లేవు. నయీమ్ భూదందాలకు సహకరించిన నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులను ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు ముగ్గురి పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ ముగ్గురు కీలక నేతలని తెలిసింది. నయీంతో సంబంధాలపై ముగ్గురు నేతల స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు.
నయీమ్ ఇంట్లో సేకరించిన ఫోటో ఆల్బమ్‌లతో పాటు, నయీమ్ ఫోన్‌కాల్ డేటా ఆధారంగా నేతల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. పూర్తి ఆధారాలు సేకరించన తర్వాత ఆ ముగ్గురు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సిట్ పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకు స్థానిక పోలీసులపై నేతల ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సిట్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇదిలావుంటే, గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఉపయోగించిన ఆయుధాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సీఐ రామకృష్ణ తెలిపారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతను ఉపయోగించిన ఆయుధాలు ఏకే 47, మూడు రివాల్వర్లు, ఇతర మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.