ఆర్టీసీ సమ్మె వెనుక తెరాస నేతలు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

మంగళవారం, 15 అక్టోబరు 2019 (16:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే 10 రోజులు దాటిపోయాయి. అయినప్పటికీ అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏమాత్రం పట్టువిడుపుల ధోరణిని వీడటం లేదు. దీంతో సమ్మె కొనసాగుతోంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. 
 
అయితే, ఈ ఆర్టీసీ సమ్మెపై అధికార తెరాస పార్టీకి చెందిన నేతలు కొందరు ఉన్నారంటూ తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారే ఈ సమ్మెకు ఆజ్యం పోశారని, ఈ విషయాన్ని తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని వెల్లడించారు. 
 
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తెరాస సర్కారును మరింతగా ఇరుకున పెడుతోంది. ఆయన కేసీఆర్‌కు ఎవరి పేర్లు చెబుతారోనన్న టెన్షన్ కొందరిలో నెలకొంది.
 
అయితే, ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు తెరాస నేతలు ఎవరూ స్పందించలేదు. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తెరాస సీనియర్ నేత కేశవరావు సోమవారం ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చర్చలు జరిగే అవకాశాలు చిగురించాయి. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇపుడు కలకలం రేపుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు