తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వైసిపి నాయకులను ముప్పతిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించారు. ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న వైసిపి వారికి శ్రీవారి సేవా టిక్కెట్లు ఇవ్వలేదు. అందులోను ఫైర్ బ్రాండ్ రోజాకు కూడా శ్రీవారి సేవా టిక్కెట్లను ఇవ్వలేదు. ఎమ్మెల్యేగా రోజా ఉన్నప్పుడు ఆమెకి సేవా టిక్కెట్ల ఇవ్వకపోవడంతో ఎన్నోసార్లు ఆలయం బయటకు వచ్చి విమర్శలు చేశారు రోజా.
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోజా నేరుగా జగన్ వద్దకు వెళ్ళి తిరుమల జెఈఓను మార్చాలని కోరినట్లు చెప్పుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పార్టీ నేతలను జెఈఓ ఇబ్బందులకు గురిచేశారన్న విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళారు రోజా. దీంతో జగన్ ఆలోచనలో పడ్డారు. దాంతో పాటు శ్రీనివాసరాజు కూడా అదే పదవిలో కొనసాగేందుకు విజయసాయిరెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేసుకున్నారు.
అలాగే మరికొంతమంది వైసిపి ముఖ్య నేతలను కలిశారు. ఇక తాను జెఈఓగానే కొనసాగుతానని అనుకున్నారు శ్రీనివాసరాజు. కానీ ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. అది కూడా పరిపాలనా శాఖకు ఆయన్ను అటాచ్ చేశారు. అంతేకాదు టిటిడి జెఈఓగా విశాఖ మెట్రో పాలిటిన్ డెవలప్‌మెంట్ అధారిటీ వైస్ ఛైర్మన్‌గా ఉన్న బసంత్ కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. జగన్ తన కోరికను నెరవేర్చి శ్రీనివాసరాజును బదిలీ చేసినందుకు సంతోషంలో ఉన్నారు ఆర్కే రోజా.