తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోరుకునే భక్తుల కోసం తెలంగాణలోని ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం, వారానికి రెండుసార్లు ఇటువంటి లేఖలను అనుమతిస్తారు.
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదించకపోవడంపై ఇటీవల జరిగిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రస్ మంత్రి కొండా సురేఖ సహా వివిధ వర్గాల నుండి విమర్శలు వచ్చాయి.
శ్రీవారి దర్శన భాగ్యం పొందడంలో తెలంగాణ భక్తులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీటీడీ ఈ విషయాన్ని తిరిగి పరిశీలించింది. టీటీడీ బోర్డులోని మెజారిటీ సభ్యులు తెలంగాణ ప్రతినిధుల నుండి ఇటువంటి సిఫార్సు లేఖలకు ఆమోదం ఇవ్వాలని వాదించారు. తత్ఫలితంగా, ఈ లేఖలను వారానికి రెండుసార్లు ఆమోదించాలని టీటీడీ నిర్ణయించింది.