తిరుమలలో అపచారం.. ఆనందనిలయంపైన కాళ్ళు పెట్టారు..?

శనివారం, 18 ఆగస్టు 2018 (21:00 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది కానీ వివాదానికి తెరలేపింది. సాక్షాత్తు స్వామివారు ఉండే ఆనంద నిలయంపైకి టిటిడి అధికారులు ఎక్కి పనిచేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇది మొత్తం అపచారమంటున్నారు వేదపండితులు. ఈ నెల 11న అంకురార్పణతో మొదలైన మహాసంప్రోక్షణ 16వ తేదీ మధ్యాహ్నంతో ముగిసింది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహానంప్రోక్షణ కార్యక్రమం సందర్భంగా మూలవిరాట్టులోని స్వామివారి శక్తిని ఓ కుంభంలోకి ఆవహనం చేస్తారు. బాలాలయం నిర్మించి ఆ కుంభాన్ని అక్కడ ప్రతిష్టిస్తారు. 
 
అంటే ఆ సమయంలో స్వామివారు ఆ కుంభంలో ఉన్నట్లు భావిస్తారు. గర్భాలయంలో స్వామి ఉండరు కాబట్టి…. లోపల, ఆలయ గోపురంపైన ఏవైనా మరమ్మతులు ఉంటే అవి పూర్తి చేస్తారు. సాధారణ సమయాల్లో ఎవరూ స్వామివారి గర్భాలయ గోపురం (ఆనంద నిలయ గోపురం)పైకి ఎక్కరు. ఏవైనా మరమ్మతులు ఉన్నా మహాసంప్రోక్షణ సమయంలో మాత్రమే చేస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం పేరుతో ఏడాదిలో పలు పర్యాయాలు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టినా…. ఆనంద నిలయ గోపురంపైకి మాత్రం ఎక్కరు. మహాసంప్రోక్షణ సమయంలో మాత్రమే మనుషులు గోపురంపైకి వెళతారు. 
 
ఆ సమయంలో ఆలయం లోపల స్వామివారు ఉండరు కాబట్టి పైకి ఎక్కినా తప్పు లేదని ఆగమ పండితులు చెబుతారు. ఈసారి కూడా మహాసంప్రోణ సందర్భంగా శ్రీవారి గర్భాలయంలోనూ, గోపురంపైన అవసరమైన మరమ్మతులు చేశారు. అయితే…. ఇప్పుడు చెప్పుదలచుకున్న విషయం ఏమంటే…. గర్భాలయంలో రమ్మతులు పూర్తయిన తరువాత స్వామివారి శక్తిని తిరిగి మూలబింబంలోకి ఆవాహన చేసి పూజలు ప్రారంభించారు. దర్శనాలూ మొదలయ్యాయి. ఆ సమయంలో కొందరు టిటిడి సిబ్బంది ఆనంద నిలయ గోపురంపై కనిపించారు. 
 
కీలకమైన అధికారి కూడా ఉన్నారు. అదీ ఆయన గోపురంపై నిలబడి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. ఇక్కడ వచ్చిన అనుమానం ఏమంటే…. స్వామివారు గర్భాలయంలో ఉన్నప్పుడు ఎవరూ ఆలయ శిఖరంపైకి ఎక్కకూడదంటారు… మరి సంప్రోక్షణ పూర్తయి, స్వామివారు బాలాలయం నుంచి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన తరువాత కూడా టిటిడి సిబ్బంది ఆనంద నిలయం గోపురంపైన సంచరిస్తూ కనిపించారు. 
 
అలా చేయవచ్చా? ఇది ఆగమ సమ్మతమేనా? మహాసంప్రోక్షణ క్రతువు ముగిసి శ్రీవారి దర్శనం మొదలైన తరువాత టిటిడి అధికారులు, సిబ్బంది ఆనంద నిలయ గోపురంపైన ఏమి చేస్తున్నారంటే… మహాసంప్రోక్షణ కోసం నిర్మించిన నిర్మాణాన్ని తొలగిస్తున్నారు. ఇది తొలగించాల్సిందేగానీ…. స్వామివారిని మూలబింబంలోకి ఆవాహన చేయక మునుపు చేయాల్సింది కదా…. స్వామివారు బాలాలయం నుంచి ప్రధాన ఆలయంలోకి చేరిన తరువాత గోపురంపైన ఉండటానికి ఆగమం అనుమతిస్తుందా? అలాగైతే మరమ్మతుల కోసం లేదా శుద్ధి కోసం ఎప్పుడైనా ఆనంద నిలయ శిఖరంపైకి ఎక్కవచ్చుకదా? మరమ్మతుల కోసం మహాసంప్రోక్షణ దాకా నిరీక్షిచాల్సిన అవసరం ఏముంటుంది?! దీనికి టిటిడి అధికారులు వివరణ ఇస్తారా? చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు