బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి భారీ వర్షాలతో జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గొల్లవానిగుంట, మాధవ నగర్, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల కింద భారీగా వర్షపు నీరు చేరింది. అటు కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. మరోవైపు తిరుమలలో వరద నీరు చేరడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అలాగే భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో శుక్రవారం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోవడం తెలిసిందే.