అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. అన్నం మెతుకులు కూడా కిందపడేయవద్దని పెద్దలు చెబుతుంటారు. తిరుమల శ్రీవారి భక్తులకు తరిగొండ వెంగమాంబ అన్నదాన సముదాయంలో పెట్టే ప్రసాదం అంటే ఎంతో భక్తి. ధనికులైనా, పేదలైనా ఎవరైనా సరే స్వామివారి ప్రసాదం తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఇక ఆ ప్రసాదం తయారుచేసే వారయితే ఎంతో నిష్టగా..క్రమశిక్షణగా పనిచేస్తారు. అదంతా ఒకే.
అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో టిటిడి అన్నదానం చేస్తోంది. ప్రతిరోజు 35 వేలమందికి పైగా ఆహారపొట్లాలను టిటిడి సరఫరా చేస్తోంది. టిటిడికి సంబంధించిన తిరుపతిలోని పద్మావతి క్యాంటీన్, మహిళా డిగ్రీ కళాశాలలోని క్యాంటీన్, అలాగే టిటిడి పరిపాలనా భవనంలోని క్యాంటీన్లలో భోజనాన్ని తయారుచేసి ఆహారపు ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు.
అయితే తిరుచానూరులోని క్యాంటీన్లో సిబ్బంది చెప్పులేసుకుని ఆహారపొట్లాలను ప్యాకింగ్ చేయడంతో పాటు అన్నంను ఆరబెట్టే సమయంలో చెప్పులేసుకుని పనులు చేస్తున్నారు. ఎంతో భక్తితో, శ్రద్థగా చేయాల్సిన పనిని చెప్పులేసుకుని సిబ్బంది పనిచేయడంపై విమర్సలు వెల్లువెత్తుతున్నాయి.