అలిపిరి నడక మార్గంలో ఎలివేటెడ్ ఫుట్‌పాట్ : ఏపీ ప్రిన్సిపల్ సీసీఎఫ్‌వో వై.మధుసూదన్ రెడ్డి

బుధవారం, 13 సెప్టెంబరు 2023 (09:49 IST)
అలిపిరి - తిరుమల నడక మార్గంలో శ్రీవారి భక్తుల కోసం ఎలివేటెడ్‌ ఫుట్‌పాత్‌, జంతువులు సులభంగా నడకదారిని దాటేందుకు ఓవర్‌ పాస్‌ల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని ఏపీ ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌వో వై.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. 
 
ఆయన మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో విలేకరులతో మాట్లాడారు. 'రెండున్నర నెలల క్రితం ఓ బాలుడిపై దాడి, ఆపై చిరుత దాడిలో బాలిక మృతి నేపథ్యంలో అలిపిరి నడకదారిలో ఎలివేటెడ్‌ ఫుట్‌పాత్‌ (ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలాంటిది), జంతువులు నడకదారిలో అటూ ఇటూ తిరిగేందుకు వీలుగా యానిమల్‌ ఓవర్‌ పాస్‌ నిర్మాణం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌, హైదరాబాద్‌కు చెందిన ఐటీ కోర్‌ సంస్థ, టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 
 
నడకదారి నుంచి 10 నుంచి 20 మీటర్ల పరిధిలో చెట్ల తొలగిస్తే జంతువు వచ్చినా భక్తులు గుర్తించి తప్పించుకునే అవకాశం ఉంది. దీనిని పరిశీలిస్తున్నాం. టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో 500 కెమెరాలతో రియల్‌ టైమ్‌ వైల్డ్‌లైఫ్‌ మానిటరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతం నడకదారిలో 130 మంది పనిచేస్తున్నారు.. వీరి సంఖ్య పెంచుతామని తెలిపారు.
 
అలాగే, ఇప్పటివరకు పట్టుకున్న ఐదు చిరుతలతో పాటు మరో ఐదు చిరుతల జాడ గుర్తించామని, అందులో రెండు శ్రీవారి మెట్టు, ఈవో క్యాంప్‌ కార్యాలయం వద్ద, మూడు అలిపిరి కాలిబాటలో ఉన్నాయని చెప్పారు. లక్షితను చంపిన చిరుత డీఎన్‌ఏ రిపోర్టు వచ్చాక ఆ చిరుతను జూలోనే ఉంచి.. మిగిలిన వాటిని 300-400 కి.మీ. దూరంలో విడిచిపెడతాం. ఘాట్‌ రోడ్లలో గుంపులుగా ద్విచక్ర వాహనాలు అనుమతించడంపై తితిదే ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు