తుంగభద్ర నది ఉరకలెత్తుతోంది.. నదీతీర గ్రామాలకు హెచ్చరిక..

మంగళవారం, 22 అక్టోబరు 2019 (13:42 IST)
తుంగభద్ర నది ఉరకలెత్తుతోంది. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,55,431 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో సైతం 1,55,431 క్యూసెక్కులు ఉండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
 
మంగళవారం వరద పోటు పెరిగే సూచనలు ఉండటంతో 2 లక్షల క్యూసెక్కులు విడుదల చేసే అవకాశం ఉందని తుంగభద్ర బోర్డ్ సెక్షన్ అధికారి విశ్వనాథ్ చెప్పారు. డ్యాంలో ప్రస్తుతం 100.663 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు. తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీరు బుధవారం నాటికి ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుకోనుంది. అక్కడి నుంచి సుంకేసుల బ్యారేజీకి వరద చేరుకునే అవకాశం ఉందని ఆర్డీఎస్ అధికారులు చెబుతున్నారు. 
 
నదీతీర గ్రామాలకు హెచ్చరిక.. 
తుంగభద్ర డ్యాం నుంచి 33 గేట్ల ద్వారా 1,55,431 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేయడంతో తెలంగాణ, ఏపీ, కర్ణాటక అధికారులను అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డ్ హెచ్చరిక జారీ చేసింది. ఆయా రాష్ట్రాల కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇరిగేషన్, రెవిన్యూ యంత్రాగానికి ఉత్తర్వులు జారీ చేసింది. తుంగభద్ర నదితీర ప్రాంత ప్రజలను నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు