అవన్నీ క్వారెంటైన్ సెంటర్లుగా మార్చేయండి: సీఎం జగన్‌కు ముప్పాళ్ల విజ్ఞప్తి

బుధవారం, 12 మే 2021 (22:26 IST)
గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తూ వేలమందిని బలితీసుకుంటూ, లక్షలాదిమందిని వ్యాధిగ్రస్తులను చేస్తున్న నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు సతీసమేతంగా చంద్రమౌళి నగర్ లోని వారి గృహంలో ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు దీక్ష లో కూర్చున్నారు. వారికి మద్దతుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రిలు వారివారి గృహాల్లో కుటుంబ సభ్యులతో దీక్షలు చేశారు.

ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ అటు దేశంలోనూ యిటు రాష్ట్రంలోనూ విస్పోటనంలా వ్యాప్తి చెందుతున్న కరోనా కేసుల నేపథ్యంలో వేలాది మంది మృత్యువాత పడుతున్నారని,ఈ దారుణ స్థితిలో రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ఈ క్రింది అంశాలను పరిశీలించి యుద్ధప్రాతిపదికన తగిన కార్యాచరణ ప్రకటించి ఈ ఘోర విపత్తు నుండి రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కోరారు.
 
ముఖ్యమంత్రి గారికి బహిరంగ విజ్ఞాపన లేఖ...
అంశాలు:
1. ప్రభుత్వ, ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల హాస్టల్స్ ను, రాష్ట్రంలోని అన్ని కళ్యాణ మండపములను క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగించి గంటలో పేషంట్లకు బెడ్లు కేటాయించాలి.
 
2. కావలసినంత వ్యాక్సిన్ ను సమీకరించి పోలియో చుక్కల పద్ధతిలో వ్యాక్సినేషన్ ను ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రజలందరికీ వేయించాలి.
 
3. అవసరమైన అన్ని మండల కేంద్రాలలో క్వారంటైన్ సెంటర్లను పెట్టాలి. అన్ని PHC లను ఆక్సిజన్ బెడ్ల హాస్పిటల్స్ గా మార్చాలి.
 
4. ప్రభుత్వ , పారిశ్రామికవేత్తల  ధార్మిక సంస్థల ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రానున్న ముప్పును ఎదుర్కోవాలి.
 
5.డాక్టర్లతోపాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణలను, ప్రోత్సాహలను అందించాలి. మరణించిన వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియో అందించాలి.
 
6. తక్షణ అవసరంలేని పద్దులను కుదించి ప్రతి జిల్లాకు 3 వందల కోట్ల ప్రత్యేక నిధిని అందించి, కరోనా సేవలను, సదుపాయాలను కల్పించాలి.
 
7. వాలెంటైర్లకు, సచివాలయ సిబ్బందికి తగిన రక్షణ కల్పించి నిత్యావసర వస్తువులన్నింటిని ప్రజల ఇళ్ల వద్దకు చేర్చి రోడ్ల మీదకు ప్రజలను రాకుండా అరికట్టాలి. ప్రభుత్వ సిబ్బందిలో వాలెంటర్ లలో కోవిడ్ మరణాలు సంభవిస్తే 25 లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలి.
 
8. ప్రతి కోవిడ్ మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలి.
 
9. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ మొహమాటాలను మాని కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక, వ్యాక్సిన్ తదితర ఇతర ప్రయోజనాలను సాదించుటకు తక్షణమే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి సూచనలను తీసుకోవాలి. ఈ అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కి, సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారికీ, వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి మెయిల్ ద్వారా పంపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు