రైతు వ్యతిరేక చట్టాలపై ఏడాది కాలంగా ఉద్యమాలు చేస్తున్న రైతులపై కనికరం చూపించాల్సింది పోయి.. కేంద్రమంత్రి తనయుడు కారుతో తొక్కించి పలువురి రైతుల మరణానికి కారకులైనా ఆ మంత్రి కొనసాగడం అర్థ రహితం అన్నారు. నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్, పెట్రోల్ డీజిల్ ఆకాశాన్నంటుతున్నా, సామాన్యుడి గోడు ప్రభుత్వాలకు పెట్టడం లేదన్నారు. సి.ఎం. జగన్ అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించారని...ఉండవల్లి బయటపెట్టిన అప్పుల లెక్కలపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉండవల్లి వాస్తవం చెప్పారని ప్రజలు బావిస్తున్నారని, రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును ఏపీ లోని అప్పుల భారంపై నిలదీసిన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఢిల్లీలో వారంలో నాలుగు రోజులు గడుపుతూ అప్పులు తేవడం కోసం తాపత్రయ పడడాన్ని ఎలా పరిగణించాలి? అని ప్రశ్నించారు. నవంబర్ నుంచి పోలవరం నిధుల కోసం సి.పి.ఐ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ లు ఇవ్వలేక పోవడం విచార కరమన్నారు. కరెంటు, ఆస్తి పన్ను పెంపు, చెత్తపై పన్ను లు పెంచి ప్రజలపై భారం మోపుతోందని అన్నారు. మోడీ , అమిత్ షా ల చేతిలో రాష్ట్ర పాలకులు కీలుబొమ్మలుగా మారారని, రాష్ట్రంలోని పోర్ట్ లను అదానీ చేతిలో పెట్టి ఆంధ్ర ప్రదేశ్ ను అదాని ప్రదేశ్ గా మార్చేశారని దుయ్య బట్టారు. పోలవరం కు రావాల్సిన నిధులు రప్పించడంలో సీఎం వైఫల్యం కారణంగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు శాఖల నిర్మాణ నివేదికను విడుదల చేశారు. జిల్లాలో పార్టీ నిర్మాణం, కార్య కలాపాలు గురించి వివరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. అన్నవరం, కూండ్రపు రాంబాబు, చెల్లుబోయిన కేశవ శెట్టి, దేవ రాజేంద్ర ప్రసాద్, కె. సత్తిబాబు, జుత్తిక కుమార్, నల్లా భ్రమరాంబ, వంగమూడి కొండల రావు, పి. సత్యనారాయణ, శీలం వెంకటేష్, మహంతి లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్యమండలి బృందం గేయాలతో అందరినీ అలరించారు.