ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా సాఫీగా సాగిపోతుందంటూ అధికార వైకాపా నేతలు ఊకదంపుడు ప్రచారం బాగానే చేస్తున్నారు. కానీ, ఆ ప్రభుత్వ పాలనలో జరిగే వింతలు విశేషాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చట్టాల్లో దిశ చట్టం ఒకటి. మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం దీనికి రూపకల్పన చేశారు. కానీ, ఆ జట్టు పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం భార్యను వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, కేసు నమోదై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌కు సీఎం జగన్ అప్పగించారు.
అయితే, సునీల్ కుమార్‌పై భార్యను వేధించిన ఆరోపణలు ఉన్నాయనే విషయం బయటకు తెలియదు. కానీ, వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి రాసిన ఫిర్యాదు లేఖతో వెలుగులోకి వచ్చాయి. పైగా, ఈ లేఖపై కేంద్రం స్పందించింది. రఘురామరాజు ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ లేఖ రాసింది.
అంతేకాకుండా అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ మిషన్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి విరాళాల రూపంలో నిధులు సేకరిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. ఈ అంశంపైనా దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో ఆరర్ఆర్ పేర్కొన్నారు.