జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే పందుల పందేలు ఆడుకోండి.. సుజనా చౌదరి కామెంట్స్

గురువారం, 26 జనవరి 2017 (10:28 IST)
తమిళ సంప్రదాయ క్రీడాపోటీలు జల్లికట్టు కోసం ఆ రాష్ట్ర యువత చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం మౌననిరసన ఉద్యమాన్ని చేపట్టనుంది. దీనిపై కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
జల్లికట్టు స్ఫూర్తి కావాలనుకుంటే వెళ్లి అదే ఆడుకోవాలని సుజనా ఎద్దేవా చేశారు. లేకపోతే కోళ్ల పందెలు, పందుల పందేలు ఆడుకోవచ్చని సుజనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తూ ఊరుకోరని, రాష్ట్రానికి ఏ సెక్షన్ కింద ఏ రూల్ కింద అన్యాయం జరిగిందో చెబితే సమాధానం చెబుతానని ఆయన సవాల్ చేశారు. 
 
ప్రత్యేక హోదా ముగిసిన అంశమని కేంద్రమంత్రి సుజనాచౌదరి మరోసారి పునరుద్ఘాటించారు. రాజకీయ పార్టీలు అనవసరంగా విద్యార్థులను, యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని సుజనా ఆరోపించారు. ఇలాంటి ఆందోళన కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం శూన్యమన్నారు. 

వెబ్దునియా పై చదవండి