అది పూర్తిగా రాయలసీమ జిల్లాల కోసం ఏర్పాటు చేసిన యూనివర్శిటీ... కరువు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆ వర్శిటీలో ఎప్పుడూ కోస్తాంధ్రకు చెందిన వారే ఉపకులపతులుగా ఎంపికవుతూ వస్తున్నారు.. పై స్థాయిలో లాబీయింగ్ చేయడంలో ఘనులైనా అక్కడి ప్రొఫెసర్ల అనంతపురంలోని జేఎన్‌టీయులో పెత్తనం చేస్తూనే ఉన్నారు. ఈ పర్యాయమైన ఈ విధానానికి ముగింపు పలుకుతారా లేదా అలాగే కొనసాగిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
రాయలసీమ జిల్లాలతోపాటు మరో జిల్లాకు సంబంధించిన ఇంజినీరింగ్ కళాలలకు, ఇంజినీరింగ్ విద్యకు ఆ యూనివర్శిటీనే పెద్ద దిక్కు. అదే అనంతపురం జిల్లాలోని జేఎన్‌టీయు. అందులో విసిగా పని చేయడానికి చాలా మందే ఉత్సాహం చూపుతారు. దాని పరిధి ఎక్కువగా ఐదు జిల్లాలు చేతిలో ఉంటాయి. అందులోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలు వారి ఏలుబడిలోకి వస్తాయి. అందుకే అక్కడి వర్శిటీపై కన్నేస్తుంటారు.
ఈ వర్శిటీ 5 లక్షల మంది విద్యార్థులకు మార్గదర్శిగా ఉంటుంది. వర్సిటీ పరిధిలో ఐదు జిల్లాల్లో మూడు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, ఒక పరిశోధన కేంద్రం, 187 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. ఇంతకంటే చరిత్ర ఏముంటుంది చెప్పండి. అందుకే చాలా మంది ఈ వర్శిటీ ఉపకులపతిగా నియమితులవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. గత ఉపకులపతి ఆచార్య లాల్‌కిషోర్ పదవీ కాలం జూన్ 29తో ముగిసింది.
ఉపకులపతి పదవిని పూరించడానికి ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రభుత్వ ప్రకటన మేరకు 85 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 30 మంది మాత్రమే ఇంజినీరింగ్ విభాగానికి చెందిన వారు. అలాగే వర్శిటీకి చెందిన 8 మంది ఆచార్యులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సెర్చ్ కమిటీ ఈనెల 6వ తేదీన సమావేశం కానుంది. సెర్చ్ కమిటీ ఏమి చెప్పినా చివరకు ప్రభుత్వం ఏమి చెబితే అదే జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. అయితే అనంత జేఎన్‌టీయూ 2008లో ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇద్దరు వీసీలు మారారు. మొదటి ఉపకులపతిగా ఆచార్య క్రిష్ణగాంధీ నియమితులయ్యారు.
రెండో పర్యాయం ఉపకులపతిగా లాల్‌కిషోర్ నియమితులయ్యారు. వీరిద్దరూ హైదరాబాద్ జేఎన్‌టీయూ కళాశాల నుంచే వచ్చిన వారే. పైగా ఇద్దరూ కోస్తాంధ్ర వాసులే. సాధారణంగా ఒక చోట వర్శిటీ ఏర్పాటయ్యిందంటే ఆ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కలుగుతుందనే నమ్మకం. నాలుగోతరగతి ఉద్యోగాలు మాత్రం దాదాపుగా ఆ ప్రాంతవాసులకే ఇస్తుంటారు. అయితే ఇక్కడ అలా జరగలేదనే ఆరోపణలున్నాయి. వీసీలుగా ఉన్నవారు స్థానికేతరులు కావడంతో స్థానికులకు అన్యాయం జరిగిందనే విమర్శలున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ పర్యాయం వీసీ అయినా స్థానికులు దక్కుతుందా.. లేక కోస్తావాసులు తన్నుకుపోతారా అనేది వేచి చూడాల్సి ఉంది.