తమిళనాడు పోల్ రిజల్ట్స్ : విజయ్‌కాంత్ పార్టీ గుర్తింపు రద్దు

శనివారం, 21 మే 2016 (13:33 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా... ఈ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పొందిన పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేస్తోంది. ఇలాంటి వాటిలో డీఎండీకే ఒకటి. డీఎండీకే పార్టీ గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించింది. 
 
ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే ఆరుశాతం ఓట్లు సంపాదించాలి. కాగా తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో కెప్టెన్ పార్టీ 2.4 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. దీంతో పార్టీ గుర్తింపు రద్దు అయింది. మే 16న జరిగిన ఎన్నికల్లో డీఎండీకే పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థులందరూ ఓడిపోయారు.

పార్టీ చీఫ్ విజయకాంత్ ఉలుందూరుపేటలో ఘోరపరాజయాన్ని చవిచూశారు. ధరావతు సైతం కోల్పోయారు. 2006లో విరుదాచలంలోను, 2011లో రిషివందియంలోను పోటీ చేసి గెలిచిన విజయకాంత్ ఈ ఎన్నికల్లో ఉలుందూరుపేటలో మట్టికరిచారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 8 శాతం ఓటు బ్యాంకు ఉండేది.  ఈ ఎన్నికల్లో డీఎండీకే ఓటు బ్యాంకు 2.4 శాతానికి తగ్గిపోయింది. దీంతో డీఎండీకే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు కోల్పోయింది. 
 

వెబ్దునియా పై చదవండి