ఏపీలో ఉద్యోగులకు అందని వేతనాలు : చంద్రబాబు కుట్రేనంటున్న విజయసాయి

గురువారం, 2 జులై 2020 (15:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ఈ పాపం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుదేనని వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని ఆరోపించారు.  వినిమయ బిల్లును శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. 
 
ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో అడ్డుకున్న చంద్రబాబు ఉద్యోగులను వేధిస్తున్నాడని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా తన వక్రబుద్ధిని మార్చుకోవడంలేదని, ప్రజలపైన కక్ష సాధిస్తున్నాడని పేర్కొన్నారు. "చంద్రబాబు మోకాలడ్డాడు అంతే. ఈ బిల్లుకు మండలి ఆమోదం అవసరంలేదు. మరో మూడ్రోజుల్లో ఉద్యోగుల వేతనాల సమస్య తొలగిపోతుంది" అని స్పష్టం చేశారు. 
 
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జూలై 1న జమ కాకపోవడంతో వేతనదారులు నిరాశకు గురయ్యారు. దీనిపై ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం వివరణ ఇచ్చారు. ద్రవ్య బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలిపారు. 
 
గత నెల 30వ తేదీ వరకు ఆర్డినెన్స్ సాయంతో ఖర్చు పెట్టామని, కానీ శాసనమండలి సమావేశాల్లో ద్రవ్య బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ఉద్యోగుల వేతనాలు ఆలస్యం అయ్యాయని వివరించారు. అయితే, రెండు, మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదంతో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
 
రాజ్యాంగ ప్రొవిజన్ ప్రకారం... అసెంబ్లీలో ఆమోదం పొందిన ద్రవ్య బిల్లు శాసనమండలి ఆమోదానికి వెళ్లి తిరిగి అసెంబ్లీకి రాకపోతే... 14 రోజుల తర్వాతే దాన్ని అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్‌కు పంపే వీలుంటుందని అజేయ కల్లం వివరించారు. గవర్నర్ ఆ బిల్లును ఆమోదిస్తే రాష్ట్రంలో మళ్లీ అధికారిక ఖర్చులు చేసేందుకు వీలవుతుందని చెప్పారు.
 
ఇటీవలి శాసన సమావేశాల్లో జూన్ 17న అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే శాసనమండలిలో ఆ బిల్లుకు మోక్షం కలగకుండానే, మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. దాంతో ఏపీ ఖజానా నుంచి నిధులు తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. 
 
నిబంధనల ప్రకారం మండలికి వెళ్లిన 14 రోజుల తర్వాత ఆ బిల్లును గవర్నర్ కు పంపాల్సి ఉంటుంది. బుధవారం అర్ధరాత్రితో ఆ గడువు పూర్తి కావడంతో ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్‌కు పంపేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లాం తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు