సర్వత్రా ఉత్కంఠత : చంద్రబాబు బెయిల్ - క్వాష్ పిటిషన్లపై తీర్పు

ఆదివారం, 8 అక్టోబరు 2023 (10:21 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అంశంపై ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు సోమవారం వెలువడనున్నాయి. ఇటు విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టులో ఈ తీర్పులు వెలువడనున్నాయి. అలాగే, కేసును కొట్టి వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మొదటి ఐటమ్‌గా విచారణ జరుగనుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో చంద్రబాబు సోమవారం అత్యంత కీలకం కానుంది. 
 
ఆయనపై సీఐడీ, పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఆయన బెయిల్ పిటిషన్‌పై కూడా ఈ నెల 9వ తేదీన తీర్పులు వెలువడనున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్ రెడ్డి నిర్ణయం వెల్లడించనున్నారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. 
 
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు 9న తీర్పు వెల్లడించనుంది. అలాగే టీడీపీ అధినేతను మరోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయనుంది. 
 
బెయిల్, కస్టడీ పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈ కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందో, లేదోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు