విజయవాడలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన కసాయి భర్త మృతదేహాన్ని ఇంటి వెనుకనే పాతిపెట్టాడు. విజయవాడ వాంబే కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కాలనీలో నివసించే తేపల్లి కుమారమ్మ మూడో కుమార్తె మరియమ్మ (30)కు అదేప్రాంతంలో విద్యుత్ పనులు నిర్వహించే దుర్గాప్రసాద్(35)తో 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుర్గాప్రసాద్ స్థానిక రాజీవ్‌నగర్‌లో నివసించే ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరియమ్మ భర్తను నిలదీయడంతో భార్యను భర్త వేధించసాగాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మరియమ్మ నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.
ఈపరిస్థితుల్లో దుర్గాప్రసాద్ భార్యను కలిసి.. ఇక నుంచి బుద్దిగా ఉంటానని, పూర్తిగా మారిపోయానంటూ నమ్మపలికాడు. దీంతో ఇద్దరూ కలిసి రెండు నెలల క్రితం వాంబే కాలనీలో అద్దెకు దిగారు. రెండురోజుల గడిచిన తర్వాత భర్త మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. అదేసమయంలో భార్య అడ్డు తొలగించుకోవాలని దుర్గారావు నిర్ణయించుకున్నాడు.